ఆసుపత్రిలో తండ్రి.. ఆస్తి కోసం కొడుకు!
– చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న
తండ్రితో బలవంతంగా ఆస్తి రాయించుకున్న వైనం
కర్నూలు: కొడుకు ఉంటే వృద్ధాప్యంలో పోషిస్తాడని, చనిపోతే తలకొరివి పెడతాడని అందరూ భావిస్తారు. కానీ ఓ కుమారుడు కఠినాత్మునిగా మారాడు. తన వాటా ముందుగానే రాయించుకున్నా.. ఆశ తీరక కన్నతండ్రి ఆసుపత్రి పడకపై చావు బతుకుల మధ్య ఉన్నా అతని ధనదాహం తీరలేదు. అపస్మారక స్థితిలో ఉన్న తండ్రి వేలిముద్రలను వీలునామాపై వేసుకుని ఉడాయించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన కిష్టప్ప(72) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. సొంత ఇంటితో పాటు 27 ఎకరాల పొలం ఉంది. గతంలో అతని పెద్ద కుమారుడు మన్మథుడు తండ్రితో గొడవ పడి 11 ఎకరాల పొలాన్ని తన వాటా కింద రాయించుకుని వెళ్లిపోయాడు. ఈనెల 7న కిష్టప్పకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ నాల్గవ యూనిట్‌లో చేర్చారు.
చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అతనికి కుమార్తె కన్యాకుమారి సేవలు చేస్తోంది. తండ్రి తదనంతరం కూడా మొత్తం ఆస్తి తనకే దక్కాలన్న స్వార్థంతో పెద్ద కుమారుడు మన్మథుడు ఈనెల 17న ఆసుపత్రికి వచ్చాడు. ఇల్లు, పొలం మొత్తం తనకే చెందేటట్లు ముందుగానే వీలునామా రాసుకుని రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మంచంపై అపస్మారక స్థితిలో ఉన్న తండ్రితో వేలిముద్ర వేయించుకున్నాడు. ఈ విషయం తెలిసి కన్యాకుమారి అతనితో గొడవ పడింది. ఆమెను తోసేసి అక్కడినుంచి ఉడాయించాడు. బుధవారం ఈ విషయమై కన్యాకుమారి స్థానిక మూడవ పట్టణ పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.