మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి సిమెంట్ కంకర మిశ్రమాన్ని నెహ్రూనగర్ ఘాట్‌కు ఉపయోగిస్తున్న దశ్యం
–అనధికార నెహ్రూనగర్ పుష్కర ఘాట్ నిర్మాణానికి ఎత్తిపోతల పథకం కంకర సరఫరా
–శరవేగంగా నిర్మాణ పనులు
నెహ్రూనగర్(పగిడ్యాల): అనధికారికంగా నిర్మిస్తున్న నెహ్రూనగర్ పుష్కర ఘాట్‌లో అడుగడుగునా అధికార దర్పం కనిపిస్తోంది. పోలీసు యంత్రాంగంతో పాటు ఇంజినీరింగ్ శాఖ అధికారులు కూడా పరోక్షంగా ఘాట్ నిర్మాణంలో పాలు పంచుకోవడం గమనార్హం. ఇది అధికారిక ఘాట్ కాదని సొంతంగానే నిర్మిస్తున్నామని మాండ్ర ప్రకటించినప్పటికి దీని వెనుక జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే నెహ్రూనగర్ ఘాట్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మెగా ఇంజినీరింగ్ కంపెనీ సిమెంట్ మిశ్రమంతో కూడిన కంకర సరఫరా చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు 200 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు ఉండే ప్రదేశంలో సిమెంట్ బెడ్ వేసే పనులను బుధవారం ఉదయం ప్రారంభయ్యాయి. అనధికారికంగా జరుగుతున్న ఈ ఘట్ పనులను మాండ్ర ముఖ్య వర్గీయులు నందికొట్కూరు మార్కెట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, నందికొట్కూరు ఎంపీపీ ప్రసాదరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సుబ్బమ్మ, వైస్‌చైర్మన్ మునాఫ్‌లు ప్రత్యేక పూజలు చేశారు. బ్యాక్‌వాటర్‌కు అతిసమీపంలో జరుగుతున్నా ఈ పనులు నీటి ప్రవాహం పెరిగితే మునిగిపోయే అవకాశం ఉందని మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ఘాట్ నిర్మాణానికి ఉపయోగించిన కంకర మిశ్రమంపై ఎత్తిపోతల పథకం మెగా ఇంజినీరింగ్ కంపెనీ సైట్ మేనేజర్ రాముడును సాక్షి వివరణ కోరగా తాను కొన్ని చెప్పేవి ఉంటాయి.. మరికొన్ని చెప్పడానికి వీలుండదన్నారు. కావాలంటే హైదరాబాద్ హెడ్ ఆఫీస్‌కు ఫోన్ చేసి కనుక్కోండని పేర్కొనడం గమనార్హం.