అమరావతి చంద్రబాబు కట్టుకుంటున్న కోట: ఉండవల్లి
రాజమండ్రి : పట్టిసీమ ప్రాజెక్ట్ జీవో, అగ్రిమెంట్ కాపీలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం పరిశీలించారు. ఇవాళ ఉదయం ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లిన ఆయన ప్రాజెక్ట్ రికార్డులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడమే ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు అని, రిజర్వాయర్ లేకుండానే 80 టీఎంసీలు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఉండవల్లి విమర్శించారు.
పట్టిసీమలో రూ.490 కోట్లు మేరకు అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. అయినా ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదని... రూ.830 కోట్లు ఖర్చుపెట్టి 53 శాతం పని చేసినట్లు చూపించారని ఉండవల్లి అన్నారు. అమరావతి చంద్రబాబు నాయుడు కట్టుకుంటున్న కోట అని, అందులో ప్రజలకు భాగస్వామ్యం లేదని ఆయన ధ్వజమెత్తారు.