కేంద్రం నిధులిస్తున్నా.. తప్పుదోవ పట్టిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వివిధ ప్రాజెక్టుల అమలు కోసం లక్షల కోట్ల నిధులు ఇస్తోందని, అయినా చవకబారు రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఏపీ ఇంచార్జి సిద్దార్థనాథ్ సింగ్ అన్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం పార్టీ నాయకురాలు పురందేశ్వరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి తప్పనిసరిగా రెవెన్యూలోటును భర్తీచేయాలని పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదని, అయినా.. ప్రధాని మోదీకి ఏపీ ప్రత్యేక రాష్ట్రం కాబట్టి ప్రతియేటా రెవెన్యూ లోటును ఇస్తున్నారని చెప్పారు.
కేంద్రం ఏపీకి రూ. 22,112 కోట్లు రెవెన్యూలోటు కింద ఇస్తోందని, ఇప్పటికే అందులో 7020 కోట్లు విడుదల చేసిందని అన్నారు. ఇక పన్నుల రూపంలో రూ. 2,06,919 కోట్లు పన్నుల రూపంలో రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. అలాగే వివిధ ప్రాజెక్టుల అమలు కోసం రూ. 1.43 లక్షల కోట్లు ఇస్తున్నామన్నారు. ఒకవైపు కేంద్రం ఇన్ని నిధులు ఇస్తున్నా.. చవకబారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఐదుగురు సభ్యులుంటారని చెప్పారు. వాళ్లు మంత్రిత్వశాఖలతో సంప్రదించి.. ప్రాజెక్టుల పురోగతిని ప్రజలకు చెబుతారని అన్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దానికి నూరుశాతం నిధులు కేంద్రమే ఇస్తుందని సిద్దార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. దానికి కావల్సిన రూ. 16వేల కోట్లు ఇస్తామని నాబార్డు ఎప్పుడో చెప్పిందని గుర్తుచేశారు. కానీ కొంతమంది మాత్రం దీనిమీద రకరకాల ప్రచారాలు చేస్తున్నారని పరోక్షంగా టీడీపీ నేతలను తప్పుబట్టారు. తమ ఇంటికి కావల్సిన ఖర్చుల కోసం డబ్బులు ఎలా సంపాదించాలో తాను, తన కొడుకు, తన భార్య చూసుకుంటామని.. పక్కింటి వాళ్లకు ఆ బాధ ఎందుకని ఎద్దేవా చేశారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఏపీకి రూ. 65 వేల కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. కేంద్రం ఇస్తున్న నిధులపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సాధారణంగా ఏ జాతీయ ప్రాజెక్టుకైనా 70-30 నిష్పత్తిలో నిధులిస్తారని, కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ప్రత్యేక రాష్ట్రం కాబట్టి ఈ ప్రాజెక్టుకు మాత్రం నూరుశాతం నిధులివ్వాల్సిందిగా ఉమాభారతి ప్రధానమంత్రికి లేఖ రాశారని... అందుకే దానికి మొత్తం నిధులన్నీ తామే ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఇకనుంచి ప్రతినెలా ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తామని, సమన్వయం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించుకుంటామని చెప్పారు. జూన్ నెలలో విజయవాడలో మరోసారి బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఉంటుందని, దాని ప్రారంభ కార్యక్రమం లేదా ముగింపు సభకు అమిత్ షా వస్తారని, ఆ సందర్భంగా జూన్‌లో విజయవాడలో అమిత్ షా ర్యాలీ ఉంటుందని తెలిపారు.