సాగు, తాగు నీటి కోసం ఐక్య ఉద్యమం
సాగు, తాగు నీటి కోసం ఐక్య ఉద్యమం
Published Mon, Apr 24 2017 12:14 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
- మే 21న నంద్యాలలో జల చైతన్య బహిరంగ సభ
- జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాలరూరల్: సాగు, తాగునీటి కోసం ఐక్య ఉద్యమం ఉద్ధృతం చేద్దామని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల మూలమఠం భీమలింగేశ్వర ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో రాయలసీమ జలసాధన సమితి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి నీటిని దిగువకు తీసుకెళ్తూ సీమను ఎడారిగా మారుస్తున్నారన్నారు. సీమ ప్రజలు చైతన్యవంతమై.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందు కోసం వచ్చే నెల 21 నంద్యాలలో రాయలసీమ జల చైతన్య బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే కరువు
ప్రకృతి కనికరించినా పాలకుల నిర్లక్ష్యం వల్లే రాయలసీమలో కరువు నెలకొందని దశరథరామిరెడ్డి అన్నారు. తక్షణమే సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనలో పేర్కొన్న విధంగా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలన్నారు. మననీరు, మన హక్కు అన్ననిదానంతో ప్రజలను ఐక్యం చేద్దామని పిలుపునిచ్చారు. పోరాటాలకు సిద్ధం కావాలని, లేదంటే ప్రభుత్వం నికర జలాలు కూడా దక్కకుండా చేస్తుందని హెచ్చరించారు.
అనంతరం అన్ని నంఘాల ప్రతినిధులు సాగు, తాగునీరు సాధించుకునేందుకు ఉద్యమంలో పాల్గొంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వైఎన్‌రెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, రామసుబ్బయ్య, గోళ్ల సుదర్శనం, వంగాల సిద్ధారెడ్డి, వెంకటసుబ్బయ్య, మహేశ్వరరెడ్డి, రామ్మూర్తి, రోజక్క, కడియం సాంబశివుడు, శివనాగయ్య, వెంకటేశ్వరగౌడ్, సుదర్శనం, సీనియర్ న్యాయవాది శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement