ఉపాధి మంటలు!
ఉపాధి మంటలు!
Published Mon, May 1 2017 11:49 PM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
హడలిపోతున్న కూలీలు
– జిల్లాలో తొమ్మిది వడదెబ్బ మరణాలు
- ఇందులో ఐదుగురు ఉపాధి కూలీలే..
– జాడలేని షేడ్‌నెట్స్ ఏర్పాటు
– కాగితాల్లోనే మజ్జిగ పంపిణీ
కర్నూలు(అర్బన్): జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉపాధి కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకు జిల్లాలో తొమ్మిది మంది వడదెబ్బతో మరణించగా.. ఇందులో ఐదుగురు ఉపాధి కూలీలే ఉన్నట్లు సమాచారం. అయితే త్రీమెన్ కమిటీ మాత్రం ఏడుగురు మాత్రమే వడదెబ్బతో మరణించినట్లు నివేదించారు. ప్రస్తుత వేసవిలో వ్యవసాయ పనుల్లేక గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం వ్యవసాయ కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. మండుతున్న ఎండల్లో ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు చేపట్టకపోవడంతో కూలీల పాలిట శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కూలీల సంఖ్య కూడా రోజురోజుకూ తగ్గిపోతోంది. ఏప్రిల్ నెలలో 1.65 లక్షల మంది కూలీలు ఉపాధి పనులు చేపట్టాల్సి ఉండగా.. ప్రస్తుతం 1.45 లక్షల మంది మాత్రమే పనులకు వస్తున్నట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. కాగా ప్రతి రోజు జిల్లాలో 2లక్షల మంది ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేసినప్పటికీ వివిధ కారణాలతో కూలీల సంఖ్య మందగిస్తోంది.
జాడలేని షేడ్‌నెట్స్
ఉపాధి కూలీలకు కాస్తంత ఉపశమనం కలిగించేందుకు వర్క్‌సైట్లలో షేడ్‌నెట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కారణాలేవైనా ఇంకా జిల్లాలో వీటి ఊసే కరువైంది. మొత్తం 50,136 షేడ్‌నెట్స్ ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు ఒక్కచోట కూడా ఏర్పాటు చేయలేకపోయారు. అయితే గత ఏడాదికి సంబంధించిన షేడ్‌నెట్స్‌ను ప్రస్తుతం 20,441 వర్క్‌సైట్లలో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా మెజారిటీ ప్రాంతాల్లో కూలీలు పనిచేస్తున్న వర్క్‌సైట్లలో వీటిని ఏర్పాటు చేయకపోవడంతో మండే ఎండల్లో చుక్కలు చూస్తున్నారు. స్థానికంగా మేటీలే షేడ్స్ ఏర్పాటు చేసుకోవాలనే అధికారుల సూచన ఎక్కడా అమలుకు నోచుకోవట్లేదు. ఈ ఏడాది కొత్తగా షేడ్‌నెట్స్ ఏర్పాటు చేసేందుకు గత నెల 26న టెండర్లు ఓపెన్ చేసినా, ఇంకా రేట్ల నెగోషియేషన్ కారణంగా ఫైల్ జాయింట్ కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఉపాధి కూలీలకు అందని మజ్జిగ
ఎండల్లో పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసే బాధ్యతను ఈ నెల 1వ తేదీ నుంచి సంబంధిత మేటీలకే అప్పగించారు. మజ్జిగకు రూ.4, మేటీకి రూ.1 ప్రకారం ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే జిల్లాలోని మెజారిటీ ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేవలం ఆయా వర్క్‌సైట్లలో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు బ్యానర్లు ఏర్పాటు చేశారే కానీ, కూలీలకు మాత్రం మజ్జిగ సరఫరా చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు 3.18 లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరఫరా చేశామని చెబుతున్నా, ఇంకా అనేక గ్రామాలకు ఇవి అందకపోవడం గమనార్హం.
షేడ్‌నెట్స్ ఏర్పాటుకు చర్యలు
జిల్లాలోని అన్ని వర్క్‌సైట్లలో షేడ్‌నెట్స్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. గత నెల 26న టెండర్లు ఓపెన్ చేసి జేసీకి పంపాం. జేసీ రాగానే ఫైల్ క్లియర్ అవుతుంది. మజ్జిగను కూడా కచ్చితంగా 1వ తేదీ నుంచి పనులకు వచ్చే కూలీలందరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మండలానికి 5వేల ప్రకారం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ గత నెల 29న ఆర్‌డీఓలకు ఆదేశాలు జారీ చేశారు. సరఫరా చేసిన ప్యాకెట్లు అయిపోగానే తిరిగి ఇండెంట్ పెట్టి తీసుకుంటాం.
- డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డ్వామా పీడీ
Advertisement