తెలంగాణ : నిప్పుల కొలిమి..! | Summer Sun Effect In Telangana | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి..!

Published Sat, May 11 2019 1:02 AM | Last Updated on Sat, May 11 2019 12:01 PM

Summer Sun Effect In Telangana - Sakshi

మున్ముందు భగభగే..
గత నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 13 వడగాడ్పు రోజులు నమోదయ్యాయి. మున్ముందు దాదాపు 20 వడగాడ్పు రోజులు ఉండనున్నాయి. గతంలో ఎన్నడూ ఇన్ని వడగాడ్పు రోజులు వచ్చిన పరిస్థితి లేదు.

13 రెడ్‌ అలర్ట్‌లు...
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 రెడ్‌ అలర్ట్‌లు నమోదైనట్లు నిపుణులు అంటు న్నారు. ఈ నెల రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది.

అలర్ట్‌ జారీ ఇలా..
సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్‌ అలర్ట్, నాలుగైదు డిగ్రీల వరకు అధికమైతే ఆరెంజ్, సాధారణం కంటే కొద్దిగా ఎక్కువైతే ఎల్లో, సాధారణం కంటే తక్కువైతే వైట్‌ అలర్ట్‌ జారీ చేస్తారు.
(చదవండి: ఆంధ్రప్రదేశ్‌.. నిప్పుల గుండం)

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విజృంభిస్తున్న వడగాడ్పులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పదుల సంఖ్యలో జనం చనిపోతున్నట్లు అంచనాలున్నా.. కలెక్టర్ల నుంచి ఇప్పటివరకు వడదెబ్బ మృతులకు సంబంధించి తమకు ఎటువంటి నివేదిక రాలేదని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. మే రెండో వారం ప్రారంభం నుంచే.. ఎండల పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. ఈ పరిస్థితి రోహిణీ కార్తె వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాది నుంచి వేడిగాలులు రాష్ట్రంపై పంజా విసురుతున్నాయి. దీంతో గాలిలో తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గతేడాది ఎండాకాలంలో మధ్యమధ్యలో కాస్తంత ఉపశమనం కలిగించేలా వర్షాలు వచ్చేవి.

కానీ ఈ నెల నాలుగో తేదీ నుంచి ఎక్కడా వర్షపు జాడలే లేవు. నిరంతరాయంగా వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం విలవిల్లాడుతున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే గత నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 13 రోజులు వడగాడ్పులు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు ఇంకా 15 నుంచి 20 వడగాడ్పు రోజులు ఉంటాయని వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు హెచ్చరించారు. అంటే మొత్తంగా ఈ ఎండాకాలం సీజన్‌లో 30 రోజులకుపైగా వడగాడ్పుల రోజులు నమోదయ్యే పరిస్థితి కనిపి స్తుంది. గతంలో ఎన్నడూ ఇన్ని రోజులపాటు వడగాడ్పులు వచ్చిన పరిస్థితి లేదు. 2017లో అత్యధికంగా 27 వడగాడ్పుల రోజులు నమోదు కాగా, ఈసారి ఆ రికార్డును ఈ ఎండాకాల సీజన్‌ బద్దలు కొట్టే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో ఊరటనిచ్చేలా ఏమైనా వర్షాలుంటే సరేసరి.. లేకుంటే ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

వాతావరణ కేంద్రం అలర్ట్‌
ఎండల తీవ్రతను బట్టి వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యంత తీవ్రమైన ఎండగా గుర్తించి రెడ్‌ అలర్ట్‌ జారీచేస్తారు. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే అప్పుడు ఎండల తీవ్రతగా గుర్తించి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేస్తారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైతే వేడి రోజుగా గుర్తించి ఎల్లో (హీట్‌వేవ్‌ వార్నింగ్‌) ఇస్తారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే వైట్‌ అలర్ట్‌ జారీచేస్తారు. తీవ్రమైన వడగాడ్పులు నమోదైతే రెడ్‌ అలర్ట్‌ ఉంటుంది. ఆ ప్రకారం ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 రెడ్‌ అలర్ట్‌లు నమోదైనట్లు నిపుణులు అంటున్నారు.

తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ వరకు అధికంగా ఉంటాయని వాతావరణ కేంద్రం వేసవి ఆరంభంలోనే హెచ్చరించింది. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాడ్పులు వీస్తున్నాయి. అంతేకాదు దేశంలో వడగాడ్పులు అధికంగా వచ్చే డేంజర్‌ జోన్‌లో తెలంగాణ ఉండటంతో ఈసారి భగభగలాడుతోంది. ఈ నెల రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ వస్తోంది. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో ఈసారి 45–47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే ప్రమాదం ఉంది.

ఎండదెబ్బకు గురికాకుండా..
ఎండ తీవ్రత బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రజలకు సూచించింది. ఆ మేరకు ఒక కరపత్రాన్ని విడుదల చేసింది.  

వడదెబ్బ లక్షణాలు...
తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం కలిగి ఉండటం, చర్మం పొడిబారటం, మత్తు నిద్ర, వాంతులు, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి.

నేడు వడగాడ్పులు
ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో శనివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆదివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల (గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో)తో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. ఇదిలావుండగా శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పు న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 42 డిగ్రీలు రికార్డు అయింది.

వడగాడ్పులుంటే...

  • నిర్మాణ కార్మికుల కోసం సంబంధిత యాజమాన్యాలు తాగునీటి వసతి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. కార్మికులకు అవసరమైన నీడ కల్పించాలి.  
  • ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి.  
  • పశువులు, కోళ్లకు వడదెబ్బ తగలకుండా తగు చర్యలు తీసుకోవాలి.
  • క్యాబ్, ఆటో డ్రైవర్లకు వేసవి తీవ్రతపై అవగాహన కల్పించాలి.
  • బస్టాండ్లలో ప్రయాణికుల కోసం తాగునీటి వసతి కల్పించాలి. కరపత్రాలు పంచాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చల్లని తాగునీరు, ఐస్‌ ప్యాక్‌లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు ఆర్టీసీ చర్యలు తీసుకోవాలి.
  • వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులను నిలిపివేయాలి.
  • ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి

  • ఎండలో తిరగకూడదు.
  • బాగా ముదురురంగు ఉండే దుస్తులు ధరించకూడదు.  
  • కాఫీ, టీలు సేవించకూడదు.
  • ఎండవేడిలో అధికంగా పనిచేయకూడదు. మధ్యమధ్యలో చల్లని ప్రదేశంలో సేదతీరుతూ పనిచేయాలి.
  • తగిన జాగ్రత్తలు లేని నిల్వ చేసిన ఆహారం, అధిక వేడి వల్ల త్వరగా చెడిపోతాయి. వాటిని తినకూడదు. డయేరియాకు గురయ్యే ప్రమాదముంది.
  • ఎండలో పార్కు చేసిన కారులో చిన్న పిల్లలు, వృద్ధులను, అనారోగ్యస్తులను ఎక్కువ సేపు ఉంచకూడదు.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

  • ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • తరచూ నీళ్లు తాగుతూ బయటకు వెళ్లేప్పుడు వెంట మంచినీళ్లు ఉండేలా చూసుకోవాలి.
  • వేసవిలో ఎక్కువగా నిమ్మరసం, కొబ్బరినీళ్ల వంటివి తీసుకోవాలి.
  • తెలుపురంగు, లేతవర్ణం కలిగిన పలుచటి కాటన్‌ వస్త్రాలు ధరించాలి.
  • తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి.
  • పలుచటి మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు, చెంచాడు చక్కెర ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ఇంటిలోనే తయారుచేయబడిన ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగినట్లయితే వడదెబ్బ నుంచి తక్షణం ఉపశమనం లభిస్తుంది.
  • వడదెబ్బ తగిలిన వారిని నీడలో చల్లని ప్రదేశంలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. కావున సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి.
  • చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు వడగాడ్పులకు గురికాకుండా కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
  • వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement