ఉగ్ర భానుడు
మేడారం@ 46.54
మర్రిగడ్డ @ 46.26
తెలంగాణలో మరో 40 రోజులు తీవ్ర వడగాడ్పులు!
ఆదివారం పలు చోట్ల రికార్డు ఉష్ణోగ్రతల నమోదు
వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 45 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వడగాల్పుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రంలో దీర్ఘకాలం వడగాల్పులు వీచిన సంవత్సరంగా 2016 నిలుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్‌నినో కారణంగా మార్చి నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ ఎండలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని, జూన్ మొదటివారం వరకు వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈసారి వడగాలులు 50 రోజులపైనే సాధారణం కంటే ఐదు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాల్పులుగా పరిగణిస్తారు. అలాగే సాధారణ ఉష్ణోగ్రతతో సంబం ధం లేకుండా 45 డిగ్రీలు నమోదైనా వడగాడ్పులుగానే లెక్కిస్తారు. ఈ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 10 రోజులకు మించి వడగాడ్పులు నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. 2010లో తెలంగాణలో 46 రోజులు వడగాలులు నమోదైనట్లు అంచనా వేశారు. అదే ఇప్పటివరకు రికార్డుగా వాతావరణ శాఖ చెబుతోంది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో 10 రోజులపాటు వడగాడ్పులు నమోదయ్యాయి. ఇంకా 40 రోజులకు మించి వడగాల్పులు రికార్డయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటోంది.
మే నెల మొత్తం రాష్ట్రంలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. జూన్ మొదటి వారం వరకు ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి రామగుండం, భద్రాచలం, నిజామాబాద్‌ల్లో 49-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత వేసవిలో ఖమ్మంలో అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక చోట్ల 45 డిగ్రీలకు మించి రికార్డు అయింది. వివిధ ప్రాంతాల్లో 10 రోజులకు మించి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈసారి 49-50 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. 1973 మే 9న భద్రాచలంలో 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డుల్లో ఉంది.
మళ్లీ మండిపోయిన రాష్ట్రం
రాష్ట్రంలో ఆదివారం 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా మేడారంలో అత్యధికంగా 46.54, కరీంనగర్ జిల్లా మర్రిగడ్డలో 46.26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం తెలిపింది. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో 45.98, మన్నెగూడెంలో 45.29, ఎల్లారెడ్డిపేటలో 45.75, మహదేవ్‌పూర్‌లో 45.03 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 45.26, దండేపల్లిలో 45.15, నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లో 45.47, భీంగల్‌లో 45.4, మెదక్ జిల్లా కల్హేర్‌లో 45.28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌లో అధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
అక్కడక్కడా జల్లులు
రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో జనం సేదతీరారు. మరో రెండ్రోజులు తీవ్రమైన వడగాడ్పులుంటాయని వాతావరణశాఖ చెబుతోంది. అక్కడక్కడా చిరుజల్లులు కురిసినా అవి వడగాడ్పుల తీవ్రతపై పెద్దగా ప్రభావం చూపబోవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
వడదెబ్బతో 45 మంది మృతి
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలకు వడదెబ్బతో 45 మంది బలయ్యారు. ఖమ్మం జిల్లాలో 12 మంది మృతిచెందగా, కరీంనగర్ జిల్లాలో 10 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు, నల్లగొండ జిల్లాలో ఐదుగురు, మెదక్ జిల్లాలో నలుగురు, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు.
ఆదివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
ఆదిలాబాద్ 44.00
హన్మకొండ 43.00
హైదరాబాద్ 42.00
ఖమ్మం 42.00
మెదక్ 43.00
నల్లగొండ 44.00
నిజామాబాద్ 44.00
రామగుండం 43.00
కర్నూలు 42.8
అనంతపురం 42.2
రెంటచింతల 43
తిరుపతి 40
విశాఖపట్నం 37.4
గతంలో వడగాడ్పులు సంభవించిన రోజులు, వడదెబ్బ మృతుల వివరాలు..
సంవత్సరం వడగాడ్పులు వడదెబ్బ మృతులు
2012 23 144
2013 13 516
2014 19 31
2015 13 541
2016 10 230
(ఇప్పటివరకు అంచనా)