మాట్లాడుతున్న జేసీ దివ్య
-
వీసీలో జేసీ దివ్య
ఖమ్మం జెడ్పీసెంటర్ : సాదాబైనామాలకు సంబంధించి ఫీల్డ్ చెక్ మెమోలు వారం రోజుల్లో ఆప్‌లోడ్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.దివ్య తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం సాదాబైనామాల ప్రగతి, కల్యాణలక్ష్మి, భూదాన్‌ల్యాండ్ల ప్రగతిపై తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సాదాబైనామాల కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన, తిరస్కరణ, చెక్ మెమోల ఆన్‌లైన్ నోటిసుల జారీని వేగవంతం చేయాలని చెప్పారు. గ్రామాలకు వెళ్లి సాదాబైనామాల కింద అందిన దరఖాస్తులను పరిశీలించాలని కోరారు. చెక్ మెమోలను ఆన్‌లైన్ చేయడంలో అలసత్వం వద్దని, నోటీస్ జనరేట్ చేసిన అనంతరం చెక్‌మెమోను ఆన్‌లైన్ చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి పంపిన భూముల మ్యుటేషన్‌లో వారం రోజుల్లోపు ప్రగతి కనబరచాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వెళ్తున్న నిత్యావసర వస్తువులను రేషన్‌దారులు విక్రయిస్తే వారిపై 17బీ, డీలు, అట్టి వస్తువులు కొనుగోలు చేసిన వారిపై 17ఈ, 6ఏ కేసులను బుక్ చేసి, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీపం పథకం నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు అక్టోబర్ నుంచి మొదలవుతుందని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. వీసీలో ఏజేసీ శివశ్రీనివాస్ పాల్గొన్నారు.