ఉన్నత చదువులే లక్ష్యంగా..
-
తూరంగి పాఠశాల విద్యార్థుల ప్రతిభ
-
వారి కలల సాకారం దిశగా విద్యా బోధన
తూరంగి (కాకినాడ రూరల్) :
చక్కని ప్రణాళిక, అంకిత భావంతో పని చేస్తూ అక్కడి ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను చక్కగా బోధిస్తున్నారు. విద్యార్థులు సైతం అదే పట్టుదలతో కృషి చేస్తున్నారు. పాఠ్యాంశాలే కాకుండా, ప్రయోగపూర్వకంగా అంశాలు బోధిస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఉచిత ఇంటర్మీడియట్ విద్యతోపాటు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విద్యకు ఇక్కడి పాఠశాల విద్యార్థులు అర్హత సాధిస్తుండడమే కాక, ఆరేళ్లుగా నూజివీడు, ఇడుపులపాయ, బాసర ట్రిపుల్ ఐటీల్లో సీట్లను సాధిస్తున్నారు.
ట్రిపుల్ ఐటీకి చిరునామా..
తూరంగిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ట్రిపుల్ ఐటీ సాధనకు చిరునామాగా మారింది. 2011లో ఇద్దరు, 2012, 13లో ఒక్కొక్కరూ, 14లో ఇద్దరు, 15లో ఇద్దరు, 16లో ఇద్దరు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందారు. ఈ విద్యా సంవత్సరం 180 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఇందులో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యను బోధిస్తున్నారు. సకాలంలో సిలబస్ పూర్తిచేస్తున్న ఉపాధ్యాయులు అంతటితో సరిపెట్టక ప్రధాన అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అదనపు వేళలను విద్యార్థుల కోసం కేటాయిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.