ఉర్దూ పాఠశాలలపై సర్కార్ నిర్లక్ష్యం
అనంతపురం అర్బన్: ఉర్దూ పాఠశాలల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఇంతియాజ్ మండిపడ్డారు. మంగళవారం నగరంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల బాలికల ఉర్దూ పాఠశాలను జిల్లా ప్రధాన కార్యదర్శి ముష్కిన్, కమిటీ సభ్యులు అల్లాబక్ష్, మహబూబ్ బాషాతో కలిసి సందర్శించారు. అక్కడి విద్యార్థినులతో ఇంతియాజ్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడిచినా పదో తరగతి విద్యార్థులకు సాంఘిక, సామాన్య శాస్త్రాలు, గణితం పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు.
ప్రతి ఏడాదీ సగం మంది విద్యార్థులకు ఉపకార వేతనం అందని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి మాత్రమే ఇలా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతారాహిత్యానికి ఇదో నిదర్శనమని మండిపడ్డారు. కంబదూరులో అన్ని తరగతులకూ ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడని, కణేకల్, తలుపుల, కదిరి, తదితర ప్రాంతాల్లోని ఉర్దూ పాఠశాలల్లో ఉర్దూ ఉపాధ్యాయులు లేరని అన్నారు. మైనారిటీ విద్యార్థుల సమస్యలపైన, వారి సంక్షేమం పైన రాష్ట్ర మైనార్టీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.