కొత్తపాలెంలో 2016లో మంజూరు ఉత్తర్వులు ఇచ్చినా బిల్లు చెల్లించని గృహం
ప్రజాసమస్యలను తీర్చడానికే ప్రజాప్రతినిధులు ఉండాలి, ఇక్కడేమో ప్రజాప్రతినిధులే ప్రజలకు సమస్యగా మారారు. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల వర్గపోరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెత్తనం కోసం పాకులాడుతూ ప్రజల సమస్యలు గాలికొదిలేశారు. ప్రభుత్వ గృహ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి గృహాలు మంజూరు కాకుండా ఒక వర్గం అడ్డుకుంటుంటే మరో వర్గం వారు ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రాకుండా అడ్డుపడుతున్నారు.
సాక్షి, బల్లికురవ (ప్రకాశం): గూడులేని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. అర్హులు గ్రామాల వారీగా దరఖాస్తులు చేసుకొంటే కొందరికే మంజూరు పత్రాలు ఇచ్చారు. ఒక్కపైసా బిల్లు కూడా చెల్లించలేదు. మరికొందరికి మంజూరు ఉత్తర్వులు రాకుండా అడ్డుకొంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మధ్య వర్గపోరులో పేదలు బలవుతున్నారు.
ముక్తేశ్వరంలో ఇల్లు నిర్మించుకొన్నా మంజూరు ఉత్తర్వులు ఇవ్వని గృహం
అర్థాంతరంగా నిలిచిన గృహాలు
ప్రభుత్వం, అధికారులు పక్కా ఇళ్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించటంతో 2015, 2016 సంవత్సరాల్లో ముక్తేశ్వరం, సూరేపల్లి, రామాంజనేయపురం, పెదఅంబడిపూడి, చిన అంబడిపూడి కొత్తపాలెం, బల్లికురవ గ్రామాల్లో సుమారు 120 మంది దరఖాస్తు చేశారు. వీరిలో కొందరికి మంజూరు ఉత్తర్వులిచ్చారు. కొందరికి మంజూరు ఉత్తర్వులు రాకుండానే అడ్డుకున్నారు. ఇంటినిర్మాణానికి దరఖాస్తు చేశాం. మంజూరు ఉత్తర్వులతో బిల్లులు చెల్లించకపోతారా అని అప్పుచేసి మరీ గృహాలు నిర్మించుకున్నారు.
వర్గపోరుతో నిలిచిన బిల్లులు
నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 2016లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో బలరాం వర్గానికి ప్రాధాన్యత తగ్గింది. అప్పటి వరకు అధికారపార్టీలో హీరోలుగా కొనసాగిన గ్రామస్థాయి నేతలు జీరోలు కాగా వైఎస్సార్ సీపీ గ్రామస్థాయి నేతలు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకోవటంతో హీరోలయ్యారు. ఈ హీరోలు టీడీపీకి ఓట్లు వేసిన లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులు మంజూరు ఉత్తర్వులనే నిలుపుదల చేయించారు.
అధికారుల వత్తాసు
గ్రామస్థాయి నేతలకు అధికారులు సైతం డూడూ బసవన్నలా తల ఊపుతూ బిల్లులు చెల్లించటంలేదు. అప్పులు తెచ్చి ఇల్లు నిర్మించుకున్నామని తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినా అధికారులు గ్రామస్థాయి నేతల్లో కనికరం లేదు. ఎమ్మెల్యే ఏ గ్రూపులో నేతలు తమకు అనుకూలమైన వారికి గతంలో నిర్మించుకొన్న ఇళ్లకు కూడా రెండో పేరుతో తిరిగి బిల్లు చెల్లించేలా చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని లబ్ధిదారులు యలగాల అంజయ్య, చల్లగుండ్ల శ్రీనివాసరావు, పోలయ్య, మందా మేరి వాపోయారు. రాబోయే ఎన్నికల్లో తమ ఇళ్ల బిల్లులు నిలుపుదల చేసిన నేతలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారులు వివరించారు.
సర్పంచ్‌గా పోటీచేశాననే బిల్లు ఆపారు
ముక్తేశ్వరం పంచాయతీ సర్పంచ్‌గా 2014లో ఎమ్మెల్సీ కరణం బలరాం ఆశీస్సులతో బరిలోకి దిగి ఓటమి పాలయ్యాను. ఆ అక్కసుతో తాను పక్కా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకుండా తన ప్రత్యర్ధులు అడ్డుకుంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడంలేదు.
– మందామేరి, రామాంజనేయపురం
అప్పుచేసి ఇల్లు నిర్మించా బిల్లు లేదు
ఇల్లు నిర్మాణానికి దరఖాస్తు చేశాను. మంజూరైన జాబితా నుంచి నా పేరు తొలగించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు.
– కోవూరి సుబ్బరావమ్మ, చిన అంబడిపూడి
టీడీపీకి ఓటు వేసి జీరో అయ్యాను
బలరాం కొడుకు వెంకటేష్ ఓట్లు వేసి, విజయవాడ మహానాడుకు వెళ్లి నేడు జీరోలం అయ్యాం. ఇళ్ల నిర్మాణానికి పేదల చేత దరఖాస్తు చేయిస్తే ఇళ్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఏనాడు చూడలేదు. రాబోయే ఎన్నికల్లో వీళ్లకి ఓటు ద్వారా బుద్ధి చెప్తాం.
– యలగాల అంజయ్య, ముక్తేశ్వరం
Comments
Please login to add a commentAdd a comment