NO BILLS
-
వర్గపోరు.. లబ్ధిదారుల బేజారు
ప్రజాసమస్యలను తీర్చడానికే ప్రజాప్రతినిధులు ఉండాలి, ఇక్కడేమో ప్రజాప్రతినిధులే ప్రజలకు సమస్యగా మారారు. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల వర్గపోరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెత్తనం కోసం పాకులాడుతూ ప్రజల సమస్యలు గాలికొదిలేశారు. ప్రభుత్వ గృహ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి గృహాలు మంజూరు కాకుండా ఒక వర్గం అడ్డుకుంటుంటే మరో వర్గం వారు ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రాకుండా అడ్డుపడుతున్నారు. సాక్షి, బల్లికురవ (ప్రకాశం): గూడులేని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. అర్హులు గ్రామాల వారీగా దరఖాస్తులు చేసుకొంటే కొందరికే మంజూరు పత్రాలు ఇచ్చారు. ఒక్కపైసా బిల్లు కూడా చెల్లించలేదు. మరికొందరికి మంజూరు ఉత్తర్వులు రాకుండా అడ్డుకొంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మధ్య వర్గపోరులో పేదలు బలవుతున్నారు. ముక్తేశ్వరంలో ఇల్లు నిర్మించుకొన్నా మంజూరు ఉత్తర్వులు ఇవ్వని గృహం అర్థాంతరంగా నిలిచిన గృహాలు ప్రభుత్వం, అధికారులు పక్కా ఇళ్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించటంతో 2015, 2016 సంవత్సరాల్లో ముక్తేశ్వరం, సూరేపల్లి, రామాంజనేయపురం, పెదఅంబడిపూడి, చిన అంబడిపూడి కొత్తపాలెం, బల్లికురవ గ్రామాల్లో సుమారు 120 మంది దరఖాస్తు చేశారు. వీరిలో కొందరికి మంజూరు ఉత్తర్వులిచ్చారు. కొందరికి మంజూరు ఉత్తర్వులు రాకుండానే అడ్డుకున్నారు. ఇంటినిర్మాణానికి దరఖాస్తు చేశాం. మంజూరు ఉత్తర్వులతో బిల్లులు చెల్లించకపోతారా అని అప్పుచేసి మరీ గృహాలు నిర్మించుకున్నారు. వర్గపోరుతో నిలిచిన బిల్లులు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 2016లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో బలరాం వర్గానికి ప్రాధాన్యత తగ్గింది. అప్పటి వరకు అధికారపార్టీలో హీరోలుగా కొనసాగిన గ్రామస్థాయి నేతలు జీరోలు కాగా వైఎస్సార్ సీపీ గ్రామస్థాయి నేతలు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకోవటంతో హీరోలయ్యారు. ఈ హీరోలు టీడీపీకి ఓట్లు వేసిన లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులు మంజూరు ఉత్తర్వులనే నిలుపుదల చేయించారు. అధికారుల వత్తాసు గ్రామస్థాయి నేతలకు అధికారులు సైతం డూడూ బసవన్నలా తల ఊపుతూ బిల్లులు చెల్లించటంలేదు. అప్పులు తెచ్చి ఇల్లు నిర్మించుకున్నామని తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినా అధికారులు గ్రామస్థాయి నేతల్లో కనికరం లేదు. ఎమ్మెల్యే ఏ గ్రూపులో నేతలు తమకు అనుకూలమైన వారికి గతంలో నిర్మించుకొన్న ఇళ్లకు కూడా రెండో పేరుతో తిరిగి బిల్లు చెల్లించేలా చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని లబ్ధిదారులు యలగాల అంజయ్య, చల్లగుండ్ల శ్రీనివాసరావు, పోలయ్య, మందా మేరి వాపోయారు. రాబోయే ఎన్నికల్లో తమ ఇళ్ల బిల్లులు నిలుపుదల చేసిన నేతలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారులు వివరించారు. సర్పంచ్‌గా పోటీచేశాననే బిల్లు ఆపారు ముక్తేశ్వరం పంచాయతీ సర్పంచ్‌గా 2014లో ఎమ్మెల్సీ కరణం బలరాం ఆశీస్సులతో బరిలోకి దిగి ఓటమి పాలయ్యాను. ఆ అక్కసుతో తాను పక్కా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకుండా తన ప్రత్యర్ధులు అడ్డుకుంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడంలేదు. – మందామేరి, రామాంజనేయపురం అప్పుచేసి ఇల్లు నిర్మించా బిల్లు లేదు ఇల్లు నిర్మాణానికి దరఖాస్తు చేశాను. మంజూరైన జాబితా నుంచి నా పేరు తొలగించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – కోవూరి సుబ్బరావమ్మ, చిన అంబడిపూడి టీడీపీకి ఓటు వేసి జీరో అయ్యాను బలరాం కొడుకు వెంకటేష్ ఓట్లు వేసి, విజయవాడ మహానాడుకు వెళ్లి నేడు జీరోలం అయ్యాం. ఇళ్ల నిర్మాణానికి పేదల చేత దరఖాస్తు చేయిస్తే ఇళ్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఏనాడు చూడలేదు. రాబోయే ఎన్నికల్లో వీళ్లకి ఓటు ద్వారా బుద్ధి చెప్తాం. – యలగాల అంజయ్య, ముక్తేశ్వరం -
అద్దెల్లేవు.. బిల్లులు రావు
కొవ్వూరు : అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. జీతాలు అందక కార్యకర్తలు, ఆయాలు ఆకలి కేకలు పెడుతుంటే.. మూడు నెలల నుంచి అద్దెలు, టీఏ, ఇతర బిల్లులు అందక వాటి నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి పేరుకుపోయిన జీతాల బకాయిల్లో కొంతమేర ఇటీవల చెల్లించినా.. ఏప్రిల్, మే జీతాల బడ్జెట్ విడుదల కాలేదు. ఇప్పట్లో ఆ బడ్జెట్ విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,889 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 332 మినీ అంగన్వాడీ కేంద్రాలు. మొత్తంగా 3,557 మంది కార్యకర్తలు, 3,889 ఆయాలు పనిచేస్తున్నారు. నెలవారీ జీతాల నిమిత్తం రూ.3 కోట్లు పైగా చెల్లించాల్సి ఉంటుంది. బడ్జెట్ ఇప్పటివరకు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. కట్టెల నిమిత్తం ఒక్కో కేంద్రానికి రూ.300 చొప్పున మార్చి నుంచి ఇప్పటివరకు ఒక్కొక్క కేంద్రానికి రూ.900 చొప్పున సుమారు రూ.35 లక్షలు చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు నెలకు రూ.750 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ.1,800 నుంచి రూ.3 వేల వరకు భవనం వైశాల్యాన్ని బట్టి అద్దెలు చెల్లించాల్సి ఉంది. మార్చి నుంచి మే 1 వరకు ఈ బకాయిలు లక్షల్లో పేరుకుపోయాయి. మొత్తంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు అన్నిరకాల బకాయిలు కలిపి రూ.5 కోట్లకు పైగా బకాయిపడినట్టు అంచనా. ఈ విషయమై ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను వివరణ కోరగా.. వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. ప్రతినెలా జీతాలివ్వాలి అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు ప్రతినెలా జీతాలు ఇవ్వాలి. అలా ఇవ్వకపోవడం వల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని బడ్జెట్‌ను విడుదల చేయాలి. ప్రతిసారి బడ్జెట్ విడుదలైతే తప్ప జీతాలు చెల్లించే వీలుండడం లేదు. అంగన్వాడీ కేంద్రాల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలి. ఈ బిల్లుల భారాన్ని కార్యకర్తలే మోయాల్సి వస్తోంది. – పి.భారతి, ప్రధాన కార్యదర్శి, జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ -
సారీ... డబ్బుల్లేవ్!
పనులు చేపడుతున్నా మంజూరుకాని బిల్లులు నిధులు విడుదల చేయడంలో సర్కారు నిర్లక్ష్యం ఎక్కడికక్కడే అసంపూర్తిగా నిలిచిపోతున్న పనులు పనులు చేసేందుకు తెచ్చిన అప్పులకు పెరిగిపోతున్న వడ్డీలు లబో దిబో మంటున్న కాంట్రాక్టర్లు విజయనగరం గంటస్తంభం: పనులు చేస్తున్నా... బిల్లులు కావట్లేదు. అసంపూర్తిగా వదిలేసినా... అడిగే నాథులు లేరు. అప్పులు చేసి పనులు చేస్తే... వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. ఇదీ జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఇదేమని ఆరా తీస్తే... ఖజానానుంచి కాసులు విడుదల కావట్లేదు. పనులు చేయాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. విడతలవారీగా సొమ్ము విడుదలైతే పనులు పూర్తి చేద్దామనుకుంటున్నవారు సగంలోనే నిలిపేస్తున్నారు. చిన్నా... చితకా... కాంట్రాక్టర్లయితే వడ్డీల బెడద తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ తీరుపై లోలోపలే మధనపడుతున్నారు. – నెల్లిమర్ల సమీపంలో డ్వామా కార్యాలయానికి ఆనుకుని ఈవీఎం గోదాము నిర్మాణానికి ప్రభుత్వం రూ.190కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ. 1.68కోట్లు విలువైన పనులు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. గోదాము ప్రారంభమై ఐదు నెలలు కావస్తోంది. పెండింగ్ పనులు ముందుకు కదల్లేదు. కారణం ఇంకా రూ.40లక్షల మేర బిల్లులు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంది. – హుద్‌హుద్‌లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు సీడీఆర్ పథకం కింద నిధులు మంజూరు చేసింది. పనులు చేసినా ఇంతవరకు బిల్లులు అందలేదని మెంటాడ మండలం మీసాలపేటకు చెందిన మహంతి సత్యారావు సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్‌సెల్‌కు వినతినందించారు. రూ.59.90లక్షల బిల్లులకు ఎల్వోసీ విడుదల చేయాలని రోడ్లు, భవనాలశాఖ ఇంజినీరింగు జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు రాసిన లేఖ అందులో జత చేశారు. వాస్తవానికి ఈ బిల్లులకు 2016లో మార్చిలో నిధులు విడుదలైనా ఖజానాపై ఆంక్షల కారణంగా చెల్లించలదేదనీ, ఆ తరువాత క్లియరెన్స్ వచ్చినా.. నిధులు లేవని వాపోయారు.జిల్లాలో ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఎంతోమంది పనులు చేసి బిల్లులందక ఇబ్బంది పడుతున్నారు. నిధులు లేకపోయినా ఏదో చేశామని ప్రచారం చేసుకోడానికి పనులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం వారికి బిల్లులివ్వాల్సిన విషయాన్ని మాత్రం విస్మరిస్తోంది. దీనివల్ల చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో రెండేళ్లగా చేసిన అనేక పనులకు బిల్లులు అందకపోవడంపై కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. ఏనాడో జరిగిన హుద్‌హుద్ పనులకు ఇంకా బిల్లులు అందలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల బిల్లులూ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, ప్రజారోగ్యం, పంచాయతీరాజ్ తదితర శాఖలకు చెందిన బిల్లులు 880వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందుకు సంబంధించి రూ.68కోట్ల వరకు అందాలి. ఇంకా ఇంజినీరింగ్ అధికారులు ఎం.బుక్ చేయక, చేసినా చెల్లింపులు ఖాతాల కార్యాలయానికి రాని బిల్లులు కూడా అనేకం ఉన్నాయి. ఇదంతా చూస్తే రూ.100కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. ఇలాగైతే పనులు సాగవు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లలో చాలామంది అధికార పార్టీకి చెందినవారే ఉన్నారు. సకాలంలో బిల్లులు అందకపోవడంతో వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పది, పదిహేను శాతం మినహా మిగిలినవారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అలాంటివారికి లక్షలాదిరూపాయల బిల్లులు అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుతెచ్చి పనులు చేస్తే ఇప్పుడు వాటి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. -
అందని బిల్లులు
మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపులేవి అప్పుల పాలవుతున్న ఏజెన్సీ మహిళలు 3 నెలలుగా బిల్లులు రాక అవస్థలు పాపన్నపేట: మధ్యాహ్న భోజన బిల్లులు పెంచినప్పటికీ వాటి చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో ఏజెన్సీ మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ మూడు నెలల బిల్లులు రాక వంటలు చేసేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. పాపన్నపేట మండలంలో 61 పాఠశాలలున్నాయి. ప్రతి రోజు సుమారు 6 వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు చేస్తున్నారు. అయితే ఏజెన్సీ మహిళలకు కనీస సౌకర్యాలు లేక ..బిల్లులు సకాలంలో రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సారి వలసలను నివారించాలనే లక్ష్యంతో వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనాలు అందజేశారు. వాటికి సంబంధించి ఇటీవలే బిల్లులు వచ్చాయి. అయితే మండలంలో ఇప్పటి వరకు జూన్ నెల నుంచి వంట బిల్లులు రాలేదు. దీంతో కిరాణం సామానుకు కష్టమవుతుందని ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాన్ని గ్రహిస్తు గ్రామాల్లోని కిరాణం దుకాణాల యాజమానులు సామానుకు రేట్లు ఎక్కువ వేసి ఉద్దెర ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల దాటగానే బిల్లులు చెల్లించక పోతే వాటికి వడ్డీ కూడా వేస్తున్నారని తెలిపారు. దీంతో తాము చేసిన వంటలకు వచ్చే బిల్లులు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు.ముఖ్యంగా తక్కువ విద్యార్థు«లున్న స్కూళ్లలో వంట బిల్లులు సరిపోవడం లేదని చెపుతున్నారు.పొద్దంతా కష్టపడే తమకు జీతాలు మాత్రం రూ.1000 చెల్లించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.50 కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదంటున్నారు.నెలకు కనీసం రూ.3000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే సుమారు 45 పాఠశాలల్లో వంట గదులు లేక ఆరుబయట వంటలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు తెలిపారు.వంట గదులు మంజూరైనట్లు చెపుతున్నా ఇంకా నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదని వాపోతున్నారు. ఈ విషయమై ఎంఇఓ మోహన్‌రాజు మాట్లాడుతు జూన్ నెల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.త్వరలో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.వంట గదులు మంజూరయ్యాయని వాటి నిర్మాణాలు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. -
అప్పుల తిప్పలు
ఐదు నెలలుగా అందని బిల్లులు ఇబ్బందుల్లో ఏజెన్సీ మహిళలు నాణ్యత లోపిస్తున్న భోజనం పట్టించుకోని అధికారులు కోహీర్: ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోయి అవస్థలు పడుతున్నారు. సకాలంలో బిల్లులు అందక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న నిర్వాహకుల కుటుంబాలు పస్తులు ఉండాల్సిన దయనీయస్థితి. మధ్యాహ్న భోజన ఏజనీలు మహిళలే నిర్వహిస్తుండటం గమనార్హం. సకాలంలో బిల్లులు చెల్లింకపోవడంతో మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత లోపిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో 33 ప్రాథమిక, 8 ప్రాథమికోన్నత, 8 ఉన్నత పాఠశాలల్లో సుమారు 5021 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే ఏజెన్సీ నిర్వాహకులకు గత ఏప్రిల్ నుంచి దాదాపు రూ.12 లక్షల మేర చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. సకాలంలో బిల్లులు అందక పోవడంతో నిర్వాహకులు నానా ఇబ్బందులకు పడుతున్నారు. కిరాణా దుకాణాల్లో అప్పులు పేరుకుపోయి సొంత ఇంటికి సరుకులు కొనలేని పరిపస్థితి నెలకొందని మహిళలు వాపోతున్నారు. నిర్వహణ కష్టంగా ఉందని, అయితే మధ్యలో మానేస్తే బిల్లులు చెల్లించరని భయపడుతున్నామన్నారు. కనీసం కుటుంబ అవసరాలు కూడా వెదుక్కోవలసివస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా నిర్వహణ కోసం అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చినవాళ్లు బకాయి తీర్చమని ఇంటికి పదేపదే వస్తుండటంతో తమ పరువుపోతోందని కన్నీళ్లపర్యంతమయ్యారు. అధికారులకు తమ వేదన విన్నివించుకున్నా ప్రయోజనం లేకుండాపోయిందని వాపోయారు. కనీసం వంటలు వండినందుకు చెల్లించే రూ. వెయ్యి గౌరవ వేతనం కూడా చెల్లించడం లేదని విచారం వ్యక్తం చేశారు. బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించకపోతే ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బిల్లులందక మండలంలోని ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 150 మంది మహిళల ఇక్కట్లు వర్ణనాతీతం. వెంటనే బిల్లులు, గౌరవ వేతనం చెల్లించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నరకం చూస్తున్నాం మధ్యాహ్న భోజనం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో నరకం చూస్తున్నాం. కిరాణా దుకాణ యజమానులు సరుకులు ఇవ్వడంలేదు. ఇప్పటి వరకు సరఫరా చేసిన సరుకుల బిల్లులు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. డుబ్బులేక దుకాణదారులకు ముఖం చూపించలేకపోతున్నాము. డబ్బుల కోసం ఇంటికి మనుషులను పంపిస్తున్నారు. అప్పుల వాళ్లు ఇళ్ల చుట్టూ తిరగడంతో నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. - సువర్ణ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు కుంటుంబసభ్యులు కష్టపడుతున్నారు మధ్యాహ్న భోజన బిల్లులు, గౌరవ వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం. చేయని నేరానికి కుటుంబ సభ్యులు సైతం కష్టాల పాలౌతున్నారు. వారి కనీస అవసరాలు తీర్చలేక పోతున్నాం. కొన్ని సార్లు పస్తులుండాల్సి వస్తోంది. అధికారులను ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. - రాజేశ్వరి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు బిల్లులు పెట్టాము మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరి నిమిత్తం పంపిస్తున్నాము. వెంటనే మంజూరు చేయాలని పలుమార్లు లెటర్లు కూడా పెట్టాం. అయినా మంజూరు చేయడం లేదు. మహిళలు కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నాం. బిల్లులు అందకపోయినప్పటికీ భోజనాలు మెనూ ప్రకారం వడ్డించమని నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. - ఎన్. శంకర్, ఎంఈఓ, కోహీర్ మండలం -
ఇంకిపోయిన లక్ష్యం
తవ్విన ఇంకుడుగుంతల్నే పూడ్చేశారు నిబంధనలకు పాతరేశారు నెలలు గడిచినా పైసలివ్వలేదు ఆర్భాటం ఎక్కువ.. ఆచరణ తక్కువ శంగవరపుకోట : నీటిని నిల్వ చేద్దాం... భూగర్భ జలాలు పెంచుదాం... అంటూ పల్లెపల్లెనా ఎక్కడికక్కడే గోతులు తవ్వించేసి... చిందరవందర చేసేశారు. నిబంధనల ప్రకారం పూడికలు చేపట్టలేదు. కొన్ని చోట్ల నీరు చేరి మత్యుకుహరాలుగా మారాయి. చిన్నపిల్లలకు ప్రాణాంతకమయ్యాయి. పశువులు వంటివాటి లెక్కేలేదు. వానలు కురిసినా... ఎక్కడా ఇంకలేదు. భూగర్భ జలాలు పెరగలేదు. ఏదో ఒకటో రెండో చూసి... అంతా తమ గొప్పతనమేనంటూ పాలకులు గొప్పలు చెప్పుకున్నారే తప్ప ఎక్కడా సత్ఫలితాలచ్చిన దాఖలాలే లేవు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రచారఆర్బాటం తప్ప ప్రయోజనం శూన్యం. ఇందుకు ఇంకుడు గుంతలే సాక్ష్యం. మండలంలో వెంకటరమణపేట పంచాయతీ శివారు దాంపురం గ్రామంలో తవ్విన ఇంకుడు గుంతలు మట్టితో పూడుకుపోయాయి, తవ్విన గుంతలపై సిమెంట్ నందలు, ఐరన్‌మెస్‌లు వేయలేదు. ఇదేమంటే మొదట్లో చాలామంది వచ్చి ఇంకుడుగుంతలు తవ్వమన్నారే తప్పా, తవ్విన వారికి బిల్లులు ఇవ్వలేదని ఇస్తారన్న నమ్మకం కూడా లేదన్నారు. – కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామంలో మహిళలచే బలవంతంగా ఇంకుడు గుంతలు తవ్వించి నెలలు గడిచినా ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. అందులో పడి ప్రమాదాల బారిన పడుతుండటంతో కొన్ని గోతులు తామే కప్పేశామని చెప్పారు. గ్రామంలో ఒక్క గుంత కూడా ప్రభుత్వ నిబంధన ప్రకారం లేదు. కొన్నింటిలో రాళ్లు మాత్రం వేశారు. వాటిపై ఐరన్ మెస్, గోనె సంచి, నంద వెయ్యలేదు. పూడుకుపోయిన ఇంకుడుగుంతలకు ఇప్పుడు బిల్లులు ఇస్తామని ఏపీఓ రమ్య చెప్పటం విశేషం. జామి మండలం కొత్తభీమసింగి గ్రామంలో 135 ఇంకుడు గుంతలు తవ్వి నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవటంతో విసుగెత్తిన గ్రామస్తులు ఇళ్ల వద్ద ఉన్న ఇంకుడు గుంతల్ని కప్పేశారు. అప్పుడు ఒత్తిడి చేసి గోతులు తవ్వించారనీ, గోతుల్లో చిన్నపిల్లలు పడి, దెబ్బలు తగలటంతో వాళ్లు ఇచ్చిన పైసలకు నమస్కారం పెట్టి గోతులు పూడ్చేశామన్నారు. పూడుకు పోయిన నిబంధనలు ఇంకుడు గుంత తవ్వకానికి రూ.147లు, 150మిమీ మెటల్‌కి రూ.137, 40మిమీ మెటల్‌కి రూ.180లు, 20 మిమీ మెటల్‌కి రూ.138లు, బేబీచిప్స్కు రూ.71లు, గోనెసంచికి రూ.30లు, ఐరన్మెస్కి రూ.337లు, సిమెంట్ నందకు రూ.450లు, నేమ్బోర్డుకి రూ.35లు, మెటీరియల్ ఫిల్ చేసినందుకు రూ.167లు మొత్తం రూ.1600 నుంచి 1800వరకూ ఇస్తారు. ఇంకుడు గుంతల్లో ఈ నిబంధలన్నీ పూడ్చేశారు. ఎక్కడా మెటల్ సరిగ్గా వేసిన పాపానపోలేదు. తవ్విన వాటిపై గన్నీబ్యాగ్, మెస్. నేమ్బోర్డ్ల ఊసేలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసుగెత్తిన లబ్ధిదారులు స్వయంగా వాటిని కప్పేస్తున్నారు. ఒక్కరూపాౖయెనా ఇవ్వలేదు – బుత్తల కనకమ్మ. కంటకాపల్లి, కొత్తవలస మండలం ఇంకుడుగుంతలు అందరం తవ్వాం. మట్టి తవ్వినందుకు ఒక్క రూపాౖయెనా ఇవ్వలేదు డబ్బులు ఇవ్వనప్పుడు తవ్వించడం ఎందుకు. రాత్రిపూట వీధుల్లో కనీకనిపించని వెలుతురులో ఈ గోతుల్లో పడిపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు పడ్డారు. వర్షం వచ్చినపుడు రోడ్డుమీద మురుగునీరు ఇంకుడు గుంతల్లో చేరి నిల్వ ఉండి దోమలు వస్తన్నాయని పూడ్చేశాం. ఉపాధి పనులకు రానివ్వమన్నారు – వాడబోయిన అప్పన్న, కొత్తభీమసింగి, జామి మండలం. మాది చిన్న ఇల్లు. వాడుకనీరు పెద్దగా ఉండదని ఇంకుడుగుంత వద్దన్నాం. ప్రతీ గుంత ఉండాలని, లేకపోతే ఉపాధి పనుల్లోకి రానివ్వమని చెప్పారు. గుంత తవ్వి నెలలు గడిచినా రూపాయి ఇవ్వలేదు. చిన్న పిల్లలు పడిపోతన్నారని ఊళ్లో చానామంది ఈ గోతులు కప్పేనారు. తవ్విన తర్వాత చూడనేలేదు – మాదాబత్తుల అప్పలన ర్సమ్మ, దాంపురం అందరూ ఇంకుడు గుంతలు తవ్వాలని, గుంతలో పిక్క, రాయి వేయమన్నారు, గుంత ఒక్కంటికి రూ.1300 చొప్పున ఇస్తారని చెప్పారు. ఎమ్మెల్యే, అధికారులొచ్చి గుంతలు చూసెళ్లారు. ఇప్పటివరకు తవ్విన గుంతకు బిల్లు చేయలేదు. బిల్లు చెల్లించలేదు – గుమ్మడి రాము, వేపాడ గ్రామంలో బీసీ కాలనీలో నా ఇంటివద్ద ఇంకుడుగుంత తవ్వాను. నిబంధనల ప్రకారం నాలుగు సైజుల్లో రాళ్లు, పిక్క వేశాను. ఫొటోలు తీసుకెళ్లారు. బిల్లులు చెల్లించలేదు. నందలు పెట్టలేదు. ఇచ్చే డబ్బులు తక్కువ, పని ఎక్కువ కావటంతో నాతో పాటు చాలామంది గుంతలు పూడ్చేశారు. -
చిత్తశుద్ధి కను‘మరుగు’
బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మారేదెన్నడు? జిల్లాలో పదివేల మంది మరుగుదొడ్లు నిర్మించుకోని ప్రజాప్రతినిధులు పారితోషకాన్ని పట్టించుకోని సర్పంచ్‌లు ఓడీఎఫ్ గ్రామాల్లోనూ అదే పరిస్థితి! జిల్లాలో 20 శాతమే ప్రగతి.. అక్టోబర్ నాటికి లక్ష్యం ప్రశ్నార్థకం? విజయనగరం కంటోన్మెంట్: మరుగుదొడ్డి నిర్మించుకుంటే రూ.15వేల ప్రోత్సాహం ఇస్తామనడంతో బాడంగి మండలం లక్ష్మీపురానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ జామి అప్పలనాయుడు. ముందుకు వచ్చి నిర్మించుకున్నారు. మరికొంత మందిని నిర్మించేలా చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, ఎంపీడీఓ అధికారికి దరఖాస్తు అందించారు. అధికారులూ సరేనన్నారు. కానీ నేటికీ ఇతనికి బిల్లు చెల్లించలేదు. ఈ గ్రామంలో మరో ఇద్దరు, పిండ్రంగివలసలో ఇజ్జాడ జానకమ్మ, రౌతు అప్పలనాయుడు, సన్యాసినాయుడు కూడా ఇదే విధంగా బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీరే కాదు జిల్లాలో సుమారు 13వేల మందికి బిల్లులు కాలేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు సక్రమంగా పని చేయకపోవడం, ప్రజల్ని చైతన్య పర్చడంలో విఫలమవ్వడంవల్లే మరుగుదొడ్ల నిర్మాణాలు జరగడం లేదు. జిల్లాలో 921 పంచాయతీల్లో 3141 గ్రామాలున్నాయి. వీటిలో 5.87లక్షల కుటుంబాలుండగా 23,44,474 జనాభా ఉంది. కానీ కేవలం 20 శాతం మాత్రమే మరుగుదొడ్లున్నాయి. ఇప్పటికి 23,000 మరుగుదొడ్లు మాత్రమే నిర్మించారు. అందులోనూ వినియోగించేవారిని లెక్కిస్తే 15 శాతానికి మించదు. 2014 అక్టోబర్ 2 నుంచి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు విస్తత ప్రచారం నిర్వహిస్తున్నా... ఫలితం మాత్రం కానరావడం లేదు. బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మార్చడానికి గడువులు, టార్గెట్లు నిర<యించుకున్నారు. అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. బోలెడంత నిధులున్నాయి. కానీ నిర్మాణానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. సిగ్గు... సిగ్గు.. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీపీ తరచూ నిధుల కోసం వెంపర్లాడుతుంటారు. అటు అధికారులు, ఇటు ఎమ్మెల్యేతో కీలక మంతనాలు నెరపుతుంటారు. కానీ ఆయన ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోలేదు. జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇటువంటి ప్రజా ప్రతినిధులు పదివేలకు పైగా ఉన్నారని సాక్షాత్తూ అధికారులు చేసిన సర్వేలోనే తేలింది. అంతే కాదు. 3వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఇళ్లల్లోనూ లేవట. విజయనగరం శివారులో నివసిస్తున్న కొందరు ప్రభుత్వ సిబ్బంది ఇళ్లలోనూ లేకపోవడాన్ని అధికారులు సర్వేలో గుర్తించారు. వీరే ఇలా ఉంటే... ఇక జనానికేం చెబుతారన్న విమర్శ ఉంది. పట్టించుకోని క్షేత్రస్థాయి సిబ్బంది! జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలకు కీలకంగా వ్యవహరించాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారనడానికి ప్రస్తుత పరిస్థితులే సాక్ష్యం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి స్థల పరిశీలనతో పాటు జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేయడం, ఎంపీడీఓకు గ్రామాల్లో సిద్ధంగా ఉన్న దరఖాస్తు దారుల వివరాలను బిల్లుల కోసం నమోదు చేయడం వంటివి చేపట్టాలి. కానీ ఇప్పటికీ ఆ పనులు సరిగా జరుగడం లేదు. ఆసక్తి ఉన్నవారు పిలిచినా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. నిర్మించి ఉపయోగించని వారెందరో! జిల్లాలో మరుగుదొడ్లు నిర్మించుకుని ఉపయోగించని కుటుంబాలు సుమారు 4,600కు పైగా ఉన్నాయి. వీరు ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించినా దానిని ఉపయోగించకుండా బహిరంగ మలవిసర్జనకు వెళ్తుంటారు. వర్షాకాలం వస్తే వీధుల్లో ముక్కు మూసుకుని వెళ్లాల్సిందే! పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు వంటి మండలాల్లో చాలా మంది మరుగుదొడ్లు నిర్మించుకుని కూడా బహిరంగ మలవిసర్జనకు దిగుతున్నారు. జిల్లాలో ఇటీవల 189 గ్రామాలను బహిరంగ మల విసర్జన గ్రామాలుగా తయారు చేయాలని అధికారులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామాల్లో అక్టోబర్ 2 నాటికి 50 శాతం లక్ష్యం చేరుకోవాలని నిర్ణయించారు. కానీ నేటికీ కొన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు కానీ, జియో ట్యాగింగ్ కానీ ప్రారంభం కాకపోవడం విశేషం. రూ.5లక్షల పారితోషకాన్నీ పట్టించుకోవట్లేదు గ్రామాల్లో నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించుకుంటే ఆయా గ్రామాలకు రూ.5లక్షల పారితోషకంతో పాటు ఆ గ్రామంలో ఇంటింటికీ మంచినీటి సదుపాయం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌లు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజల్ని చైతన్య పర్చేందుకు ముందుకు రావడం లేదు. మరో పక్క కోట్లాది రూపాయలతో ప్రచారాలు మాత్రం చేపడుతున్నారు. ప్రజా ప్రతినిధులనే బాధ్యులను చేస్తున్నాం: ఎన్వి రమణమూర్తి, పర్యవేక్షక ఇంజనీరు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ, విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్యంతో పాటు ప్రజా ప్రతినిధుల చొరవ చాలా అవసరం. త్వరలో వారిని కూడా బాధ్యులను చేయనున్నాం. అందరు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వారిని అప్రమత్తం చేస్తాం. జిల్లాలో ఇప్పటికే పది గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్ది పురస్కారానికి ప్రతిపాదించాం. – -
చాటుమాటున ఎన్నాళ్లీ పాట్లు
మంజూరవని వ్యక్తిగత మరుగుదొడ్లు దరఖాస్తులకు నేటికీ మోక్షం లేదు నిర్మించిన వారికి బిల్లుల్లేవు వెంకటాపురం గ్రామస్తుల ఆవేదన సీతానగరం: వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోమని ఊదరగొడతారు. నిర్మించుకుంటాం మహాప్రభో అంటే మంజూరు చేయరు. ఫలితంగా స్వచ్ఛభారత్ నినాదాలకే పరిమితమైంది. వెంకటాపురంలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక దడి కట్టి.. పాతచీరలు చుట్టి మరుగుదొడ్లుగా వినియోగిస్తున్నారు. రాష్ట్రీయరహదారికి కూతవేటు దూరంలో వెంకటాపురంలో సుమారు 135 కుటుంబాలున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని గ్రామసభలకు వచ్చిన అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు. మరుగుదొడ్లు లేక వెదురు కర్రలతో దడి కట్టి పాతచీరలు చుట్టి మరుగుదొడ్లుగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. గత ఏడాది మరుగుదొడ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం పూర్తి చేసినా సగం బిల్లులు చెల్లించారంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని, నిర్మాణాలు పూర్తి చేసిన వారికి పూర్తి బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. అప్పు చేసి నిర్మించా: జె.రాము అప్పు చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాను. నిర్మాణాన్ని పూర్తి చేసిన వెంటనే బిల్లు చెల్లిస్తామనడంతో అప్పు చేసి కట్టించుకున్నాను. ఇప్పటికీ బల్లు అందలేదు. తక్షణమే బిల్లులు చెల్లించాలి. బిల్లు చెల్లించక ఆర్థిక ఇబ్బందులు: వై.భాస్కరరావు, అంటిపేట మాకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరవకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. కొందరికి బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే మంజూరు చేయాలి. దరఖాస్తులు పరిశీలిస్తాం: జి.పైడితల్లి, ఎంపీడీవో, సీతానగరం మండలంలో మరుగుదొడ్ల మంజూరుకు సిద్ధంగా ఉన్నాం. వెంకటాపురంలో వ్యక్తిగత మరుగుదొడ్లు కావాలని వచ్చి దరఖాస్తులను పరిశీలించాకSమంజూరుచేస్తాం. -
విద్యార్థులకు ‘వడ్డీ’ భోజనం!
ఐదు నెలలుగా అందని మధ్యామ్న భోజన బిల్లులు జిల్లావ్యాప్తంగా పేరుకుపోయిన రూ.20 కోట్లు భారాన్ని మోయలేమంటున్న నిర్వాహకులు మెదక్: నెలల తరబడి మధ్యాహ్న భోజన బిల్లలు అందక జిల్లావ్యాప్తంగా కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు బిల్లులు మంజూరు చేసినప్పటికీ ఎస్టీఓలో ఫ్రీజింగ్ వి«ధించారు. దీంతో బిల్లులు చేతికందక నిర్వాహకులు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,982 ఉన్నాయి. ఇందులో సుమారు 5 లక్షలకుపైగా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా 536 మంది వంట నిర్వాహకులున్నారు. కాగా నెలకు వంట నిర్వాహకులు జిల్లావ్యాప్తంగా రూ. 4 కోట్లు వెచ్చించి రకరకాల కూరగాయలు, గుడ్లు, వంటనూనె, ఉప్పులు, పప్పులకు ఖర్చు చేసి విద్యార్థులకు భోజనం వండి వడ్డిస్తున్నారు. కాగా వారికి ఏప్రిల్ నుండి బిల్లులు రావడం లేదు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 20 కోట్లు వంట నిర్వాహకులకు చెల్లించాల్సి ఉంది. కాగా జిల్లా ఉన్నతాధికారులు రూ. 12 కోట్లు మంజూరు చేస్తూ ఎస్టీవోలకు ఆదేశాలు జారీ చేసినప్పటికి ఖజానా ఖాళీ అంటూ ఫ్రీజింగ్ విధించారు. దీంతో నిర్వాహకులు ఇక మధ్యాహ్న భోజన నిర్వాహణ మా వల్ల కాదని ఆవేదన చెందుతున్నారు. నెలల తరబడి బిల్లులు ఇవ్వకపోగా ఒక్కొక్కరికి నెలకు ఇవ్వాల్సిన రూ. 1000 వాటిని సైతం మంజూరు చేయలేని దుస్థితి నెలకొంది. అప్పులు చేసి వంట చేసి పెట్టాల్సి వస్తోందని, దీంతో తమ కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయని పలువురు నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. కాగా ఐదు నెలలుగా బిల్లులు రాకపోవడంతో కొన్ని పాఠశాలల్లో నిర్వాహకులు మెనూ పాటించకుండా నామమాత్రపు భోజనాన్ని పెడుతునట్లు సమాచారం. దీంతో పౌష్టిక ఆహారం సంగతి అటుంచి విద్యార్థులు అర్ధాకలితో అలమట్టించే దుస్థితి నెలకొంది. ఈ విషయంపై ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే వాస్తవమేనని ఒప్పుకుంటున్నారు. ఇదేంటని నిలదీస్తే నిర్వాహకులు బిల్లులు రావడం లేదని వంటను మానేస్తారేమోనని భయపడుతున్నామంటున్నారు. వంట నిర్వాహకులకు నెలనెలా భోజన బిల్లులను విడుదల చేస్తే కచ్చితంగా మెనూ పాటిస్తారని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం విద్యార్థులపై ఇచ్చే కమీషన్ వంటకోసం చేసిన అప్పు వడ్డి కిందకే సరిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి పెండింగ్‌లోని మధ్యాహ్న భోజన బిలులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుని పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో కూడిన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రూ.2 లక్షల అప్పుల పాలయ్యా కొన్ని నెలలుగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన బిల్లులను విడుదల చేయకపోవడంతో రూ.2 లక్షల వరకు అప్పులు చేసి భోజనాన్ని పెడుతున్నాం. వాటిని రూ.3 వడ్డీ చొప్పున తెచ్చాం. వచ్చే కమీషన్ మాకు వడ్డీ కిందికే సరిపోయే పరిస్థితి దాపురించింది. - కమ్మరి సంగమ్మ, వంట నిర్వాహకురాలు, హవేళి ఘనపూర్ జీతం సైతం ఇవ్వడం లేదు మాకు నెలల తరబిడి బిల్లులు రావడం లేదు. అంతే కాకుండా నెలనెల ఇచ్చే గౌరవ వేతనం సైతం ఇవ్వడం లేదు. మా సార్లను అడిగితే మంజూరయ్యాయి కానీ ప్రభుత్వం దగ్గర పైసల్లేక ఫ్రీజింగ్ పెట్టారని చెబుతున్నారు. బయట అప్పులు తలకుమించిన భారం అయ్యాయి. అప్పులిచ్చిన వారికి ముఖం చూపించలేకపోతున్నాం. మాకు రావాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలి. - మూగ లక్షి, హవేళి ఘణపూర్ -
అప్పుల భోజనం
నాలుగు నెలలుగా అందని బిల్లులు ఆందోళనలో మధ్యాహ్న భోజన కార్మికులు పెరిగిన నిత్యావసరాల ధరలు దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు కరీంనగర్ రూరల్ : బిల్లులు అందక మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులపాలవుతున్నారు. నాలుగు నెలలుగా ఒక్క పైసా రాకపోవడం..నిత్యావసరాల ధరలు పెరగడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలల బిల్లులు దాదాపు రూ.25లక్షలు రావాల్సి ఉంది. కరీంనగర్ మండలంలో ప్రాథమిక పాఠశాలలు 47, ప్రాథమికోన్నత 8, జెడ్పీపాఠశాలలు 15 ఉన్నాయి. మొత్తం 4,912 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. శనివారం చామన్‌పల్లి జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్నభోజనం పథకం అమలు చేస్తున్న తీరును ‘సాక్షి’ పరిశీలించగా పలు విషయాలు వెలుగుచూశాయి. బెంబేలెత్తిస్తున్న ధరలు మధ్యాహ్న భోజనం వండేందుకు అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంది, పెసరపప్పు, నూనె, కోడిగుడ్లు, కూరగాయాలు ధరలు పెరగడంతో ప్రతిరోజు కొనుగోలు చేయడం భారంగా మారింది. ప్రతి రోజు ఒక్కో విద్యార్థికి భోజన ఖర్చు ప్రభుత్వం రూ.6.40 నిర్వాహకులకు చెల్లిస్తోంది. కోడిగుడ్డు ధర మార్కెట్లో ప్రస్తుతం రూ.5 ఉండగా ప్రతి సోమ, గురువారం విద్యార్థులకు కోడిగుడ్లతో భోజనం పెట్టాల్సి రావడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులతో సామగ్రి వంట చేసేందుకు అవసరమైన కిరాణ సామగ్రిని అప్పుపై తీసుకొస్తున్నారు. ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుండగా పప్పులు, నూనె, కట్టెలు, కూరగాయాలు, కోడిగుడ్లను కిరాణ దుకాణంలో వాయిదాపై కొనుగోలు చేస్తున్నారు. నాలుగు నెలలుగా బిల్లులు అందక అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.30వేల వరకు అప్పులైనట్లు తెలిపారు. బిల్లులు రాక ఇబ్బంది – కొట్టె లక్ష్మి, అవారి లచ్చమ్మ నాలుగు నెలలుగా వంట బిల్లులు రాకపోవడంతో ఇబ్బందవుతుంది. పప్పులు, నూనె, కూరగాయాలను ఉద్దెరపై కొంటున్నాము. ఐదు నెలలుగా జీతం ఇత్తలేదు. వంటచేసిన బిల్లులిత్త లేదు. జీతాలివ్వకపోవడంతో అప్పులపాలవుతున్నాము. వెంటనే బిల్లులిచ్చి ఆదుకోవాలి. మెనూ ప్రకార ం భోజనం – కె.లక్ష్మారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, చామన్‌పల్లి మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డిస్తున్నాము. నిర్వాహకులతో రుచికర వంటను చేయించేందుకు కషి చేస్తున్నాము. ప్రతిరోజు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వాహకులతో వంట చేయిస్తున్నాము. ప్రతి రోజు ఉపాధ్యాయుడు రుచిచూసిన తర్వాతే విద్యార్థులకు పెడుతున్నాము. త్వరలో బిల్లులు మంజూరు – చుక్కారెడ్డి, ఎంఈవో మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు రెండు, మూడు రోజుల్లో చెల్లిస్తాం. అన్ని పాఠశాలల నుంచి నాలుగు నెలలకు సంబంధించిన బిల్లులను ట్రెజరీ కార్యాలయానికి పంపించాము. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన తర్వాత చెల్లిస్తాం. -
హామీకి తూట్లు
అనంతపురం సెంట్రల్ : మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో 8, 9 నెలల క్రితం కూలీలు చేసిన పనులకు నేటికీ బిల్లులు చెల్లించలేదు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరైనా పంపిణీ బాధ్యతలు చేపట్టిన యాక్సిస్బ్యాంకు-ఫినో కంపెనీలు కూలీల సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంపిణీ బాధ్యతల నుంచి తప్పుకుని ఏడు నెలలు అవుతున్నా కూలీలకు చెల్లించాల్సిన మొత్తం ఇవ్వకుండా నాన్చుతున్నారు. రూ.3 కోట్ల నేటికీ అందకపోవడంతో వందలాది మంది కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెలితే... మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో కూలీలకు బిల్లులు చెల్లింపుల బాధ్యతను ఫినో కంపెనీకి అప్పగించారు. కూలీల వేలిముద్రల ఆధారంగా పంపిణీ చేపట్టాలని ఆదేశాలు రావడంలో జిల్లాలో బిల్లు చెల్లింపుల కార్యక్రమం ప్రహసనంగా తయారైంది. కూలీల వేలిముద్రలు సరిపోలకపోవడంతో మిషన్లు అంగీకరించక రూ. కోట్లు బకాయిలుగా పేరుకుపోయాయి. దీంతో సదరు కంపెనీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో గతేడాది సెప్టెంబర్‌లో పంపిణీ బాధ్యతల నుంచి యాక్సిస్బ్యాంకు- ఫినో కంపెనీలను తప్పించి పోస్టాఫీసు ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అప్పటి వరకూ కూలీలకు రూ.3 కోట్లు బకాయి పడ్డారు. ఈ మొత్తం అప్పటికే ప్రభుత్వం నుంచి మంజూరై సదరు కంపెనీ ఖాతాలో జమ అయింది. పంపిణీ బాధ్యతల నుంచి సదరు కంపెనీ తప్పుకుని నేటికీ 7 నెలలు గడుస్తోంది. అయితే ఇంత వరకూ రూ. 3 కోట్లు నిధులకు కంపెనీ లెక్క చెప్పలేదు. కంపెనీ వద్దే మిగిలిపోయిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని యాక్సిస్‌బ్యాంకుకు పలుమార్లు డ్వామా అధికారులు నివేదికలు పంపారు. అయితే కంపెనీ మాత్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. కేవలం వడ్డీలకు ఆశపడే బ్యాంకు నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకటీ రెండు కాదు ఏకంగా 7 నెలలుగా రూ. 3 కోట్లు ఏజెన్సీ వద్దే నిలిచిపోయినా సదరు కంపెనీపై చర్యలకు సిఫార్సు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 8,9 నెలలుగా కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్న కంపెనీ పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూడురోజులు గడువు ఇచ్చాం : నాగభూషణం, ప్రాజెక్టు డెరైక్టర్, డ్వామా ఉపాధిహామీ పథకంలో పనులు చేసిన కూలీలకు చెల్లించాల్సిన మొత్తం రూ. 3 కోట్లు యాక్సిస్బ్యాంకు- ఫినో కంపెనీ వద్దే నిలిచిపోయాయి. దీని వలన కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చెల్లించాలని పలుమార్లు కంపెనీని కోరాం. మంగళవారం స్వయాన కలెక్టర్ మూడురోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఆపై సమస్య పరిస్కరించకపోతే క్రిమినల్ కేసులు పెడుతామని హెచ్చరించాం.