విద్యార్థులకు ‘వడ్డీ’ భోజనం! | no payment for mid day meals | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ‘వడ్డీ’ భోజనం!

Published Wed, Aug 24 2016 7:02 PM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM

హవేళిఘణపూర్‌లో పాఠశాలలో వంట చేస్తున్న నిర్వాహకులు - Sakshi

హవేళిఘణపూర్‌లో పాఠశాలలో వంట చేస్తున్న నిర్వాహకులు

  • ఐదు నెలలుగా అందని మధ్యామ్న భోజన బిల్లులు
  • జిల్లావ్యాప్తంగా పేరుకుపోయిన రూ.20 కోట్లు
  • భారాన్ని మోయలేమంటున్న నిర్వాహకులు
  • మెదక్‌:  నెలల తరబడి మధ్యాహ్న భోజన బిల్లలు అందక జిల్లావ్యాప్తంగా కోట్లాది రూపాయల బకాయిలు  పేరుకుపోయాయి.  ప్రభుత్వ ఉన్నతాధికారులు బిల్లులు మంజూరు చేసినప్పటికీ ఎస్‌టీఓలో ఫ్రీజింగ్‌ వి«ధించారు. దీంతో బిల్లులు చేతికందక నిర్వాహకులు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు.

    జిల్లాలో మొత్తం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,982 ఉన్నాయి. ఇందులో సుమారు 5 లక్షలకుపైగా పేద విద్యార్థులు  చదువుకుంటున్నారు. కాగా 536 మంది వంట నిర్వాహకులున్నారు. కాగా నెలకు వంట నిర్వాహకులు జిల్లావ్యాప్తంగా రూ. 4 కోట్లు వెచ్చించి  రకరకాల కూరగాయలు, గుడ్లు, వంటనూనె, ఉప్పులు, పప్పులకు ఖర్చు చేసి విద్యార్థులకు భోజనం వండి వడ్డిస్తున్నారు.

    కాగా వారికి ఏప్రిల్‌ నుండి బిల్లులు రావడం లేదు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 20 కోట్లు వంట నిర్వాహకులకు చెల్లించాల్సి ఉంది. కాగా జిల్లా ఉన్నతాధికారులు రూ. 12 కోట్లు మంజూరు చేస్తూ ఎస్‌టీవోలకు ఆదేశాలు జారీ చేసినప్పటికి ఖజానా ఖాళీ అంటూ ఫ్రీజింగ్‌ విధించారు. దీంతో నిర్వాహకులు ఇక మధ్యాహ్న భోజన నిర్వాహణ మా వల్ల కాదని ఆవేదన చెందుతున్నారు.

    నెలల తరబడి బిల్లులు ఇవ్వకపోగా ఒక్కొక్కరికి  నెలకు ఇవ్వాల్సిన రూ. 1000 వాటిని సైతం మంజూరు చేయలేని దుస్థితి నెలకొంది. అప్పులు చేసి వంట చేసి పెట్టాల్సి వస్తోందని, దీంతో తమ కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయని పలువురు నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు.

    కాగా ఐదు నెలలుగా బిల్లులు రాకపోవడంతో కొన్ని పాఠశాలల్లో నిర్వాహకులు మెనూ పాటించకుండా నామమాత్రపు భోజనాన్ని పెడుతునట్లు సమాచారం. దీంతో పౌష్టిక ఆహారం సంగతి అటుంచి విద్యార్థులు అర్ధాకలితో అలమట్టించే దుస్థితి నెలకొంది. ఈ విషయంపై ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే వాస్తవమేనని ఒప్పుకుంటున్నారు. 

    ఇదేంటని నిలదీస్తే  నిర్వాహకులు బిల్లులు రావడం లేదని వంటను మానేస్తారేమోనని భయపడుతున్నామంటున్నారు. వంట నిర్వాహకులకు నెలనెలా భోజన బిల్లులను విడుదల చేస్తే కచ్చితంగా మెనూ పాటిస్తారని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం  విద్యార్థులపై ఇచ్చే కమీషన్‌ వంటకోసం చేసిన అప్పు వడ్డి కిందకే సరిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

    ఇప్పటికైనా  పాలకులు స్పందించి పెండింగ్‌లోని  మధ్యాహ్న భోజన బిలులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుని పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో కూడిన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

    రూ.2 లక్షల అప్పుల పాలయ్యా
    కొన్ని నెలలుగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన బిల్లులను విడుదల చేయకపోవడంతో రూ.2 లక్షల వరకు అప్పులు చేసి భోజనాన్ని పెడుతున్నాం. వాటిని రూ.3  వడ్డీ చొప్పున తెచ్చాం. వచ్చే కమీషన్‌ మాకు వడ్డీ కిందికే సరిపోయే పరిస్థితి దాపురించింది.  - కమ్మరి సంగమ్మ, వంట నిర్వాహకురాలు, హవేళి ఘనపూర్‌

    జీతం సైతం ఇవ్వడం లేదు
    మాకు నెలల తరబిడి బిల్లులు రావడం లేదు. అంతే కాకుండా నెలనెల ఇచ్చే గౌరవ వేతనం సైతం ఇవ్వడం లేదు. మా సార్లను అడిగితే మంజూరయ్యాయి కానీ ప్రభుత్వం దగ్గర పైసల్లేక ఫ్రీజింగ్‌ పెట్టారని చెబుతున్నారు.  బయట అప్పులు తలకుమించిన భారం అయ్యాయి. అప్పులిచ్చిన వారికి ముఖం చూపించలేకపోతున్నాం. మాకు రావాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలి.
    - మూగ లక్షి, హవేళి ఘణపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement