ఇంకిపోయిన లక్ష్యం | no funds for ponds | Sakshi
Sakshi News home page

ఇంకిపోయిన లక్ష్యం

Published Wed, Sep 7 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

ఇంకుడు గుంతలకి పైసా ఇవ్వలేదని చెబుతున్న కంటకాపల్లి మహిళలు

ఇంకుడు గుంతలకి పైసా ఇవ్వలేదని చెబుతున్న కంటకాపల్లి మహిళలు

తవ్విన ఇంకుడుగుంతల్నే పూడ్చేశారు
నిబంధనలకు పాతరేశారు
నెలలు గడిచినా పైసలివ్వలేదు
ఆర్భాటం ఎక్కువ.. ఆచరణ తక్కువ
 
శంగవరపుకోట :  నీటిని నిల్వ చేద్దాం... భూగర్భ జలాలు పెంచుదాం... అంటూ పల్లెపల్లెనా ఎక్కడికక్కడే గోతులు తవ్వించేసి... చిందరవందర చేసేశారు. నిబంధనల ప్రకారం పూడికలు చేపట్టలేదు. కొన్ని చోట్ల నీరు చేరి మత్యుకుహరాలుగా మారాయి. చిన్నపిల్లలకు ప్రాణాంతకమయ్యాయి. పశువులు వంటివాటి లెక్కేలేదు. వానలు కురిసినా... ఎక్కడా ఇంకలేదు. భూగర్భ జలాలు పెరగలేదు. ఏదో ఒకటో రెండో చూసి... అంతా తమ గొప్పతనమేనంటూ పాలకులు గొప్పలు చెప్పుకున్నారే తప్ప ఎక్కడా సత్ఫలితాలచ్చిన దాఖలాలే లేవు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రచారఆర్బాటం తప్ప ప్రయోజనం శూన్యం. ఇందుకు ఇంకుడు గుంతలే సాక్ష్యం. మండలంలో వెంకటరమణపేట పంచాయతీ శివారు దాంపురం గ్రామంలో తవ్విన ఇంకుడు గుంతలు మట్టితో పూడుకుపోయాయి, తవ్విన గుంతలపై సిమెంట్‌ నందలు, ఐరన్‌మెస్‌లు వేయలేదు. ఇదేమంటే మొదట్లో చాలామంది వచ్చి ఇంకుడుగుంతలు తవ్వమన్నారే తప్పా, తవ్విన వారికి బిల్లులు ఇవ్వలేదని ఇస్తారన్న నమ్మకం కూడా లేదన్నారు. 
– కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామంలో మహిళలచే బలవంతంగా ఇంకుడు గుంతలు తవ్వించి నెలలు గడిచినా ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. అందులో పడి ప్రమాదాల బారిన పడుతుండటంతో కొన్ని గోతులు తామే కప్పేశామని చెప్పారు. గ్రామంలో ఒక్క గుంత కూడా ప్రభుత్వ నిబంధన ప్రకారం లేదు. కొన్నింటిలో రాళ్లు మాత్రం వేశారు. వాటిపై ఐరన్‌ మెస్, గోనె సంచి, నంద వెయ్యలేదు. పూడుకుపోయిన ఇంకుడుగుంతలకు ఇప్పుడు బిల్లులు ఇస్తామని ఏపీఓ రమ్య చెప్పటం విశేషం. జామి మండలం కొత్తభీమసింగి గ్రామంలో 135 ఇంకుడు గుంతలు తవ్వి నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవటంతో విసుగెత్తిన గ్రామస్తులు ఇళ్ల వద్ద ఉన్న ఇంకుడు గుంతల్ని కప్పేశారు. అప్పుడు ఒత్తిడి చేసి గోతులు తవ్వించారనీ, గోతుల్లో చిన్నపిల్లలు పడి, దెబ్బలు తగలటంతో వాళ్లు ఇచ్చిన పైసలకు నమస్కారం పెట్టి గోతులు పూడ్చేశామన్నారు. 
 
 
పూడుకు పోయిన నిబంధనలు
ఇంకుడు గుంత తవ్వకానికి రూ.147లు, 150మిమీ మెటల్‌కి రూ.137, 40మిమీ మెటల్‌కి రూ.180లు, 20 మిమీ మెటల్‌కి రూ.138లు, బేబీచిప్స్‌కు రూ.71లు, గోనెసంచికి రూ.30లు, ఐరన్‌మెస్‌కి రూ.337లు, సిమెంట్‌ నందకు రూ.450లు, నేమ్‌బోర్డుకి రూ.35లు, మెటీరియల్‌ ఫిల్‌ చేసినందుకు రూ.167లు మొత్తం రూ.1600 నుంచి 1800వరకూ ఇస్తారు. ఇంకుడు గుంతల్లో ఈ నిబంధలన్నీ పూడ్చేశారు. ఎక్కడా మెటల్‌ సరిగ్గా వేసిన పాపానపోలేదు. తవ్విన వాటిపై గన్నీబ్యాగ్, మెస్‌. నేమ్‌బోర్డ్‌ల ఊసేలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసుగెత్తిన లబ్ధిదారులు స్వయంగా వాటిని కప్పేస్తున్నారు. 
 
ఒక్కరూపాౖయెనా ఇవ్వలేదు – బుత్తల కనకమ్మ. కంటకాపల్లి, కొత్తవలస మండలం
ఇంకుడుగుంతలు అందరం తవ్వాం. మట్టి తవ్వినందుకు ఒక్క రూపాౖయెనా ఇవ్వలేదు డబ్బులు ఇవ్వనప్పుడు తవ్వించడం ఎందుకు. రాత్రిపూట వీధుల్లో కనీకనిపించని వెలుతురులో ఈ గోతుల్లో పడిపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు పడ్డారు. వర్షం వచ్చినపుడు రోడ్డుమీద మురుగునీరు ఇంకుడు గుంతల్లో చేరి నిల్వ ఉండి దోమలు వస్తన్నాయని  పూడ్చేశాం. 
 
ఉపాధి పనులకు రానివ్వమన్నారు – వాడబోయిన అప్పన్న, కొత్తభీమసింగి, జామి మండలం.
మాది చిన్న  ఇల్లు. వాడుకనీరు పెద్దగా ఉండదని ఇంకుడుగుంత వద్దన్నాం. ప్రతీ గుంత ఉండాలని, లేకపోతే ఉపాధి పనుల్లోకి రానివ్వమని చెప్పారు. గుంత తవ్వి నెలలు గడిచినా రూపాయి ఇవ్వలేదు. చిన్న పిల్లలు పడిపోతన్నారని ఊళ్లో చానామంది ఈ గోతులు కప్పేనారు. 
 
తవ్విన తర్వాత చూడనేలేదు – మాదాబత్తుల అప్పలన ర్సమ్మ, దాంపురం 
అందరూ ఇంకుడు గుంతలు తవ్వాలని, గుంతలో పిక్క, రాయి వేయమన్నారు, గుంత ఒక్కంటికి రూ.1300 చొప్పున  ఇస్తారని చెప్పారు. ఎమ్మెల్యే, అధికారులొచ్చి గుంతలు చూసెళ్లారు. ఇప్పటివరకు తవ్విన గుంతకు బిల్లు  చేయలేదు.
 
 
 బిల్లు చెల్లించలేదు –  గుమ్మడి రాము, వేపాడ
గ్రామంలో బీసీ కాలనీలో నా ఇంటివద్ద ఇంకుడుగుంత తవ్వాను. నిబంధనల ప్రకారం నాలుగు సైజుల్లో రాళ్లు, పిక్క వేశాను. ఫొటోలు తీసుకెళ్లారు. బిల్లులు చెల్లించలేదు. నందలు పెట్టలేదు. ఇచ్చే డబ్బులు తక్కువ, పని ఎక్కువ కావటంతో నాతో పాటు చాలామంది గుంతలు పూడ్చేశారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement