సారీ... డబ్బుల్లేవ్‌! | No money.. sorry | Sakshi
Sakshi News home page

సారీ... డబ్బుల్లేవ్‌!

Published Fri, Oct 7 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

సారీ... డబ్బుల్లేవ్‌!

సారీ... డబ్బుల్లేవ్‌!

పనులు చేపడుతున్నా మంజూరుకాని బిల్లులు
నిధులు విడుదల చేయడంలో సర్కారు నిర్లక్ష్యం
ఎక్కడికక్కడే అసంపూర్తిగా నిలిచిపోతున్న పనులు
పనులు చేసేందుకు తెచ్చిన అప్పులకు పెరిగిపోతున్న వడ్డీలు
లబో దిబో మంటున్న కాంట్రాక్టర్లు
 
విజయనగరం గంటస్తంభం:  పనులు చేస్తున్నా... బిల్లులు కావట్లేదు. అసంపూర్తిగా వదిలేసినా... అడిగే నాథులు లేరు. అప్పులు చేసి పనులు చేస్తే... వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. ఇదీ జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఇదేమని ఆరా తీస్తే... ఖజానానుంచి కాసులు విడుదల కావట్లేదు. పనులు చేయాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. విడతలవారీగా సొమ్ము విడుదలైతే పనులు పూర్తి చేద్దామనుకుంటున్నవారు సగంలోనే నిలిపేస్తున్నారు. చిన్నా... చితకా... కాంట్రాక్టర్లయితే వడ్డీల బెడద తట్టుకోలేకపోతున్నారు.   ప్రభుత్వ తీరుపై లోలోపలే మధనపడుతున్నారు.
 
– నెల్లిమర్ల సమీపంలో డ్వామా కార్యాలయానికి ఆనుకుని ఈవీఎం గోదాము నిర్మాణానికి ప్రభుత్వం రూ.190కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ. 1.68కోట్లు విలువైన పనులు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. గోదాము ప్రారంభమై ఐదు నెలలు కావస్తోంది. పెండింగ్‌ పనులు ముందుకు కదల్లేదు. కారణం ఇంకా రూ.40లక్షల మేర బిల్లులు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంది. 
– హుద్‌హుద్‌లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు సీడీఆర్‌ పథకం కింద నిధులు మంజూరు చేసింది. పనులు చేసినా ఇంతవరకు బిల్లులు అందలేదని మెంటాడ మండలం మీసాలపేటకు చెందిన మహంతి సత్యారావు సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌సెల్‌కు వినతినందించారు. రూ.59.90లక్షల బిల్లులకు ఎల్‌వోసీ విడుదల చేయాలని రోడ్లు, భవనాలశాఖ ఇంజినీరింగు జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు రాసిన లేఖ అందులో జత చేశారు. వాస్తవానికి ఈ బిల్లులకు 2016లో మార్చిలో నిధులు విడుదలైనా ఖజానాపై ఆంక్షల కారణంగా చెల్లించలదేదనీ, ఆ తరువాత క్లియరెన్స్‌ వచ్చినా.. నిధులు లేవని వాపోయారు.జిల్లాలో ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఎంతోమంది పనులు చేసి బిల్లులందక ఇబ్బంది పడుతున్నారు. నిధులు లేకపోయినా ఏదో చేశామని ప్రచారం చేసుకోడానికి పనులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం వారికి బిల్లులివ్వాల్సిన విషయాన్ని మాత్రం విస్మరిస్తోంది. దీనివల్ల చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో రెండేళ్లగా చేసిన అనేక పనులకు బిల్లులు అందకపోవడంపై కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. ఏనాడో జరిగిన హుద్‌హుద్‌ పనులకు ఇంకా బిల్లులు అందలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల బిల్లులూ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, ప్రజారోగ్యం, పంచాయతీరాజ్‌ తదితర శాఖలకు చెందిన బిల్లులు 880వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందుకు సంబంధించి రూ.68కోట్ల వరకు అందాలి. ఇంకా ఇంజినీరింగ్‌ అధికారులు ఎం.బుక్‌ చేయక, చేసినా చెల్లింపులు ఖాతాల కార్యాలయానికి రాని బిల్లులు కూడా అనేకం ఉన్నాయి. ఇదంతా చూస్తే రూ.100కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. 
 
 
ఇలాగైతే పనులు సాగవు
పనులు చేపట్టిన కాంట్రాక్టర్లలో చాలామంది అధికార పార్టీకి చెందినవారే ఉన్నారు. సకాలంలో బిల్లులు అందకపోవడంతో వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పది, పదిహేను శాతం మినహా మిగిలినవారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అలాంటివారికి లక్షలాదిరూపాయల బిల్లులు అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుతెచ్చి పనులు చేస్తే ఇప్పుడు వాటి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement