అద్దెల్లేవు.. బిల్లులు రావు
అద్దెల్లేవు.. బిల్లులు రావు
Published Sat, May 13 2017 1:48 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
కొవ్వూరు : అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. జీతాలు అందక కార్యకర్తలు, ఆయాలు ఆకలి కేకలు పెడుతుంటే.. మూడు నెలల నుంచి అద్దెలు, టీఏ, ఇతర బిల్లులు అందక వాటి నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి పేరుకుపోయిన జీతాల బకాయిల్లో కొంతమేర ఇటీవల చెల్లించినా.. ఏప్రిల్, మే జీతాల బడ్జెట్ విడుదల కాలేదు. ఇప్పట్లో ఆ బడ్జెట్ విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,889 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 332 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. మొత్తంగా 3,557 మంది కార్యకర్తలు, 3,889 ఆయాలు పనిచేస్తున్నారు. నెలవారీ జీతాల నిమిత్తం రూ.3 కోట్లు పైగా చెల్లించాల్సి ఉంటుంది. బడ్జెట్ ఇప్పటివరకు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. కట్టెల నిమిత్తం ఒక్కో కేంద్రానికి రూ.300 చొప్పున మార్చి నుంచి ఇప్పటివరకు ఒక్కొక్క కేంద్రానికి రూ.900 చొప్పున సుమారు రూ.35 లక్షలు చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు నెలకు రూ.750 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ.1,800 నుంచి రూ.3 వేల వరకు భవనం వైశాల్యాన్ని బట్టి అద్దెలు చెల్లించాల్సి ఉంది. మార్చి నుంచి మే 1 వరకు ఈ బకాయిలు లక్షల్లో పేరుకుపోయాయి. మొత్తంగా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అన్నిరకాల బకాయిలు కలిపి రూ.5 కోట్లకు పైగా బకాయిపడినట్టు అంచనా. ఈ విషయమై ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను వివరణ కోరగా.. వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.
ప్రతినెలా జీతాలివ్వాలి
అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు ప్రతినెలా జీతాలు ఇవ్వాలి. అలా ఇవ్వకపోవడం వల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని బడ్జెట్‌ను విడుదల చేయాలి. ప్రతిసారి బడ్జెట్ విడుదలైతే తప్ప జీతాలు చెల్లించే వీలుండడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలి. ఈ బిల్లుల భారాన్ని కార్యకర్తలే మోయాల్సి వస్తోంది.
– పి.భారతి, ప్రధాన కార్యదర్శి,
జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
Advertisement
Advertisement