తప్పు చేశావ్.. రూ.10 వేలు కట్టి, ఉద్యోగం చేసుకో
Published Mon, Mar 14 2016 12:07 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
కోడిగూడెంలో అంగన్‌వాడీ అక్రమాలపై పంచాయితీ
ప్రజాప్రతినిధుల తీర్పుపై గ్రామస్తుల మండిపాటు
కోడిగూడెం(ద్వారకాతిరుమల) : పశ్చిమ గోదావరి జిల్లా కోడిగూడెం అంగన్‌వాడీ కేంద్రం అవకతవకలపై ఆదివారం పంచాయితీ నిర్వహించిన ప్రజాప్రతినిధులు కేంద్ర నిర్వాహకురాలికి రూ.10 వేలను జరిమానా విధిస్తూ తీర్పునివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నో అవకతవకలకు పాల్పడి, తప్పును ఒప్పుకుంటున్న నిర్వాహకురాలు పి.హేమలతకు రూ. 10 వేలను జరిమానా వేసి, నీ ఉద్యోగం నువ్వు చేసుకోమని హామీలు గుప్పించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం మధ్యాహ్నం స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో పలు అవకతవకలపై చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో సర్పంచ్ కుమారుడు మానుకొండ జయరాజు, ఉప సర్పంచ్ భర్త కటికిరెడ్డి బాలాజీ, ఎంపీటీసీ భర్త తాడేపల్లి పౌలు పంచాయితీని ఏర్పాటు చేసినట్టు స్థానికులు పేర్కొన్నారు. ఇన్ని అవకతవకలకు పాల్పడిన నిర్వాహకురాలు హేమలతను కొనసాగించాలా.. లేక తొలగించాలా అన్నదానిపై నిర్వ హించిన ఈ పంచాయితీలో దాదాపు అందరూ ఆమెను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల తరపున వచ్చినవారి కుటుంబ సభ్యులు మాత్రం తప్పు చేసిందని నిర్వాహకురాలు ఒప్పుకుంటుంది కాబట్టి రూ. 10 వేలను జరిమానాగా విధిస్తున్నట్లు తీర్పునిచ్చేశారు. దీంతో ఒక్కసారిగా విస్మయానికి గురైన చిన్నారుల తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు ఇదేం చోద్యమని తీవ్రస్థాయిలోధ్వజమెత్తారు.
దీంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తప్పుచేసిన వ్యక్తి ని తప్పించేందుకు పంచాయితీ జరపడం ఏమిటని మహిళలు ఆగ్రహించారు. అసలు పంచాయితీ నిర్వహించడానికి మీరెవరంటూ ఎదురుతిరిగారు. ఇంత జరుగుతున్నా అంగన్‌వాడీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీనిపై తాము కలెక్టర్‌కు ఫిర్యా దు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే అంగన్‌వాడీ నిర్వాహకురాలి అవకతవకలకు పాల్పడుతున్న విషయం నిజమేనని, ఆమెను తొలగించాల్సిందేనని చెబుతున్న సర్పంచ్ కుమారుడు జయరాజు పంచాయితీలో మాత్రం జరిమానా విషయం ఎత్తడంపై అసలు ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement