అప్పుల తిప్పలు | no bills for mid-day meals | Sakshi
Sakshi News home page

అప్పుల తిప్పలు

Published Thu, Sep 15 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

విద్యార్థులకు అన్నం వడ్డిస్తున్న మహిళలు

విద్యార్థులకు అన్నం వడ్డిస్తున్న మహిళలు

ఐదు నెలలుగా అందని బిల్లులు
ఇబ్బందుల్లో ఏజెన్సీ మహిళలు
నాణ్యత లోపిస్తున్న భోజనం
పట్టించుకోని అధికారులు

కోహీర్‌: ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోయి అవస్థలు పడుతున్నారు. సకాలంలో బిల్లులు అందక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న నిర్వాహకుల కుటుంబాలు పస్తులు ఉండాల్సిన దయనీయస్థితి. మధ్యాహ్న భోజన ఏజనీలు మహిళలే నిర్వహిస్తుండటం గమనార్హం.  సకాలంలో బిల్లులు చెల్లింకపోవడంతో మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత లోపిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మండలంలో 33 ప్రాథమిక, 8 ప్రాథమికోన్నత, 8 ఉన్నత పాఠశాలల్లో సుమారు 5021 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే ఏజెన్సీ నిర్వాహకులకు గత ఏప్రిల్‌ నుంచి దాదాపు రూ.12 లక్షల మేర చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది.  సకాలంలో బిల్లులు అందక పోవడంతో నిర్వాహకులు నానా ఇబ్బందులకు పడుతున్నారు. కిరాణా దుకాణాల్లో అప్పులు పేరుకుపోయి సొంత ఇంటికి సరుకులు కొనలేని పరిపస్థితి నెలకొందని మహిళలు వాపోతున్నారు.

నిర్వహణ కష్టంగా ఉందని, అయితే మధ్యలో మానేస్తే బిల్లులు చెల్లించరని భయపడుతున్నామన్నారు. కనీసం కుటుంబ అవసరాలు కూడా వెదుక్కోవలసివస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా నిర్వహణ కోసం అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చినవాళ్లు బకాయి తీర్చమని ఇంటికి పదేపదే వస్తుండటంతో తమ పరువుపోతోందని కన్నీళ్లపర్యంతమయ్యారు. అధికారులకు తమ వేదన విన్నివించుకున్నా ప్రయోజనం లేకుండాపోయిందని వాపోయారు.

కనీసం వంటలు వండినందుకు చెల్లించే రూ. వెయ్యి గౌరవ వేతనం కూడా చెల్లించడం లేదని విచారం వ్యక్తం చేశారు. బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించకపోతే ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బిల్లులందక మండలంలోని ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 150 మంది మహిళల ఇక్కట్లు వర్ణనాతీతం. వెంటనే బిల్లులు, గౌరవ వేతనం చెల్లించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

నరకం చూస్తున్నాం
మధ్యాహ్న భోజనం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో నరకం చూస్తున్నాం. కిరాణా దుకాణ యజమానులు సరుకులు ఇవ్వడంలేదు. ఇప్పటి వరకు సరఫరా చేసిన సరుకుల బిల్లులు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. డుబ్బులేక దుకాణదారులకు ముఖం చూపించలేకపోతున్నాము. డబ్బుల కోసం ఇంటికి మనుషులను పంపిస్తున్నారు. అప్పుల వాళ్లు ఇళ్ల చుట్టూ తిరగడంతో నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. - సువర్ణ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు

కుంటుంబసభ్యులు కష్టపడుతున్నారు
మధ్యాహ్న భోజన బిల్లులు, గౌరవ వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం. చేయని నేరానికి కుటుంబ సభ్యులు సైతం కష్టాల పాలౌతున్నారు. వారి కనీస అవసరాలు తీర్చలేక పోతున్నాం. కొన్ని సార్లు పస్తులుండాల్సి వస్తోంది.  అధికారులను ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. - రాజేశ్వరి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు

బిల్లులు పెట్టాము
మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరి నిమిత్తం పంపిస్తున్నాము. వెంటనే మంజూరు చేయాలని పలుమార్లు లెటర్లు కూడా పెట్టాం. అయినా మంజూరు చేయడం లేదు. మహిళలు కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నాం. బిల్లులు అందకపోయినప్పటికీ భోజనాలు మెనూ ప్రకారం వడ్డించమని నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. - ఎన్‌. శంకర్‌, ఎంఈఓ, కోహీర్‌ మండలం

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement