హామీకి తూట్లు | To guarantee the integrity undermined | Sakshi
Sakshi News home page

హామీకి తూట్లు

Published Thu, Mar 26 2015 2:58 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

To guarantee the integrity undermined

అనంతపురం సెంట్రల్ : మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో 8, 9 నెలల క్రితం కూలీలు చేసిన పనులకు నేటికీ బిల్లులు చెల్లించలేదు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరైనా పంపిణీ బాధ్యతలు చేపట్టిన యాక్సిస్‌బ్యాంకు-ఫినో కంపెనీలు కూలీల సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంపిణీ బాధ్యతల నుంచి తప్పుకుని ఏడు నెలలు అవుతున్నా కూలీలకు చెల్లించాల్సిన మొత్తం ఇవ్వకుండా నాన్చుతున్నారు. రూ.3 కోట్ల నేటికీ అందకపోవడంతో వందలాది మంది కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెలితే... మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో కూలీలకు బిల్లులు చెల్లింపుల బాధ్యతను ఫినో కంపెనీకి అప్పగించారు.

కూలీల వేలిముద్రల ఆధారంగా పంపిణీ చేపట్టాలని ఆదేశాలు రావడంలో జిల్లాలో బిల్లు చెల్లింపుల కార్యక్రమం ప్రహసనంగా తయారైంది. కూలీల వేలిముద్రలు సరిపోలకపోవడంతో మిషన్లు అంగీకరించక రూ. కోట్లు బకాయిలుగా పేరుకుపోయాయి. దీంతో సదరు కంపెనీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో గతేడాది సెప్టెంబర్‌లో పంపిణీ బాధ్యతల నుంచి యాక్సిస్‌బ్యాంకు- ఫినో కంపెనీలను తప్పించి పోస్టాఫీసు ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అప్పటి వరకూ కూలీలకు రూ.3 కోట్లు బకాయి పడ్డారు. ఈ మొత్తం అప్పటికే ప్రభుత్వం నుంచి మంజూరై సదరు కంపెనీ ఖాతాలో జమ అయింది. పంపిణీ బాధ్యతల నుంచి సదరు కంపెనీ తప్పుకుని నేటికీ 7 నెలలు గడుస్తోంది. అయితే ఇంత వరకూ రూ. 3 కోట్లు నిధులకు కంపెనీ లెక్క చెప్పలేదు.

కంపెనీ వద్దే మిగిలిపోయిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని యాక్సిస్‌బ్యాంకుకు పలుమార్లు డ్వామా అధికారులు నివేదికలు పంపారు. అయితే కంపెనీ మాత్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. కేవలం వడ్డీలకు ఆశపడే బ్యాంకు నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకటీ రెండు కాదు ఏకంగా 7 నెలలుగా రూ. 3 కోట్లు ఏజెన్సీ వద్దే నిలిచిపోయినా సదరు కంపెనీపై చర్యలకు సిఫార్సు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 8,9 నెలలుగా కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్న కంపెనీ పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
 
మూడురోజులు గడువు ఇచ్చాం : నాగభూషణం, ప్రాజెక్టు డెరైక్టర్, డ్వామా
ఉపాధిహామీ పథకంలో పనులు చేసిన కూలీలకు చెల్లించాల్సిన మొత్తం రూ. 3 కోట్లు యాక్సిస్‌బ్యాంకు- ఫినో కంపెనీ వద్దే నిలిచిపోయాయి. దీని వలన కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చెల్లించాలని పలుమార్లు కంపెనీని కోరాం. మంగళవారం స్వయాన కలెక్టర్ మూడురోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఆపై సమస్య పరిస్కరించకపోతే క్రిమినల్ కేసులు పెడుతామని హెచ్చరించాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement