విజయనగరంలోని ఓ మరుగుదొడ్డి
చిత్తశుద్ధి కను‘మరుగు’
Published Tue, Aug 30 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మారేదెన్నడు?
జిల్లాలో పదివేల మంది మరుగుదొడ్లు నిర్మించుకోని ప్రజాప్రతినిధులు
పారితోషకాన్ని పట్టించుకోని సర్పంచ్‌లు
ఓడీఎఫ్ గ్రామాల్లోనూ అదే పరిస్థితి!
జిల్లాలో 20 శాతమే ప్రగతి.. అక్టోబర్ నాటికి లక్ష్యం ప్రశ్నార్థకం?
విజయనగరం కంటోన్మెంట్: మరుగుదొడ్డి నిర్మించుకుంటే రూ.15వేల ప్రోత్సాహం ఇస్తామనడంతో బాడంగి మండలం లక్ష్మీపురానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ జామి అప్పలనాయుడు. ముందుకు వచ్చి నిర్మించుకున్నారు. మరికొంత మందిని నిర్మించేలా చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, ఎంపీడీఓ అధికారికి దరఖాస్తు అందించారు. అధికారులూ సరేనన్నారు. కానీ నేటికీ ఇతనికి బిల్లు చెల్లించలేదు. ఈ గ్రామంలో మరో ఇద్దరు, పిండ్రంగివలసలో ఇజ్జాడ జానకమ్మ, రౌతు అప్పలనాయుడు, సన్యాసినాయుడు కూడా ఇదే విధంగా బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీరే కాదు జిల్లాలో సుమారు 13వేల మందికి బిల్లులు కాలేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు సక్రమంగా పని చేయకపోవడం, ప్రజల్ని చైతన్య పర్చడంలో విఫలమవ్వడంవల్లే మరుగుదొడ్ల నిర్మాణాలు జరగడం లేదు. జిల్లాలో 921 పంచాయతీల్లో 3141 గ్రామాలున్నాయి. వీటిలో 5.87లక్షల కుటుంబాలుండగా 23,44,474 జనాభా ఉంది. కానీ కేవలం 20 శాతం మాత్రమే మరుగుదొడ్లున్నాయి. ఇప్పటికి 23,000 మరుగుదొడ్లు మాత్రమే నిర్మించారు. అందులోనూ వినియోగించేవారిని లెక్కిస్తే 15 శాతానికి మించదు. 2014 అక్టోబర్ 2 నుంచి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు విస్తత ప్రచారం నిర్వహిస్తున్నా... ఫలితం మాత్రం కానరావడం లేదు. బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మార్చడానికి గడువులు, టార్గెట్లు నిర<యించుకున్నారు. అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. బోలెడంత నిధులున్నాయి. కానీ నిర్మాణానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు.
సిగ్గు... సిగ్గు..
జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీపీ తరచూ నిధుల కోసం వెంపర్లాడుతుంటారు. అటు అధికారులు, ఇటు ఎమ్మెల్యేతో కీలక మంతనాలు నెరపుతుంటారు. కానీ ఆయన ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోలేదు. జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇటువంటి ప్రజా ప్రతినిధులు పదివేలకు పైగా ఉన్నారని సాక్షాత్తూ అధికారులు చేసిన సర్వేలోనే తేలింది. అంతే కాదు. 3వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఇళ్లల్లోనూ లేవట. విజయనగరం శివారులో నివసిస్తున్న కొందరు ప్రభుత్వ సిబ్బంది ఇళ్లలోనూ లేకపోవడాన్ని అధికారులు సర్వేలో గుర్తించారు. వీరే ఇలా ఉంటే... ఇక జనానికేం చెబుతారన్న విమర్శ ఉంది.
పట్టించుకోని క్షేత్రస్థాయి సిబ్బంది!
జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలకు కీలకంగా వ్యవహరించాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారనడానికి ప్రస్తుత పరిస్థితులే సాక్ష్యం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి స్థల పరిశీలనతో పాటు జియో ట్యాగింగ్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, ఎంపీడీఓకు గ్రామాల్లో సిద్ధంగా ఉన్న దరఖాస్తు దారుల వివరాలను బిల్లుల కోసం నమోదు చేయడం వంటివి చేపట్టాలి. కానీ ఇప్పటికీ ఆ పనులు సరిగా జరుగడం లేదు. ఆసక్తి ఉన్నవారు పిలిచినా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.
నిర్మించి ఉపయోగించని వారెందరో!
జిల్లాలో మరుగుదొడ్లు నిర్మించుకుని ఉపయోగించని కుటుంబాలు సుమారు 4,600కు పైగా ఉన్నాయి. వీరు ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించినా దానిని ఉపయోగించకుండా బహిరంగ మలవిసర్జనకు వెళ్తుంటారు. వర్షాకాలం వస్తే వీధుల్లో ముక్కు మూసుకుని వెళ్లాల్సిందే! పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు వంటి మండలాల్లో చాలా మంది మరుగుదొడ్లు నిర్మించుకుని కూడా బహిరంగ మలవిసర్జనకు దిగుతున్నారు. జిల్లాలో ఇటీవల 189 గ్రామాలను బహిరంగ మల విసర్జన గ్రామాలుగా తయారు చేయాలని అధికారులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామాల్లో అక్టోబర్ 2 నాటికి 50 శాతం లక్ష్యం చేరుకోవాలని నిర్ణయించారు. కానీ నేటికీ కొన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు కానీ, జియో ట్యాగింగ్ కానీ ప్రారంభం కాకపోవడం విశేషం.
రూ.5లక్షల పారితోషకాన్నీ పట్టించుకోవట్లేదు
గ్రామాల్లో నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించుకుంటే ఆయా గ్రామాలకు రూ.5లక్షల పారితోషకంతో పాటు ఆ గ్రామంలో ఇంటింటికీ మంచినీటి సదుపాయం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌లు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజల్ని చైతన్య పర్చేందుకు ముందుకు రావడం లేదు. మరో పక్క కోట్లాది రూపాయలతో ప్రచారాలు మాత్రం చేపడుతున్నారు.
ప్రజా ప్రతినిధులనే బాధ్యులను చేస్తున్నాం: ఎన్‌వి రమణమూర్తి, పర్యవేక్షక ఇంజనీరు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ, విజయనగరం
జిల్లాలో ప్రజా చైతన్యంతో పాటు ప్రజా ప్రతినిధుల చొరవ చాలా అవసరం. త్వరలో వారిని కూడా బాధ్యులను చేయనున్నాం. అందరు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వారిని అప్రమత్తం చేస్తాం. జిల్లాలో ఇప్పటికే పది గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్ది పురస్కారానికి ప్రతిపాదించాం.
–
Advertisement
Advertisement