urdu schools
-
‘పది’లో ఉర్దూ తడాఖా !
జిల్లాలో ఉర్దూ పాఠశాలలు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటాయి. ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరత తీర్చకపోయినా, తగినన్ని వసతులు కల్పించకపోయినా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ఇతర పాఠశాలలకు తీసిపోని విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాయి. జిల్లాలో 28 ఉర్దూ ఉన్నత పాఠశాలలు ఉండగా, అందులో 16 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచాయి. మదనపల్లె సిటీ: పదో తరగతిలో జిల్లాలో ఉర్దూ పాఠశాలలకు ఉత్తమ ఫలితాలు లభించాయి. మారుమూల ప్రాంతాలైన పెనుమూరు మండలంలోని పూనేపల్లె, కుప్పంలోని కుప్పం మెయిన్, వి.కోట మండలంలోని వి.కోట ఉర్దూ మెయిన్, నడిపేపల్లి, కొంగాటం, మండల కేంద్రాలైన రామకుప్పం, బైరెడ్డిపల్లె, రొంపిచెర్ల, పీలేరు, బి.కొత్తకోట, యాదమరి మండలంలోని 14 కండ్రిగ, కలికిరి మండలంలోని గడి, మహల్, మదనపల్లె రూరల్ మండలం బాలాజీనగర్, పెద్దతిప్పసముద్రం, ,పెద్దమండ్యం మండలంలోని కలిచెర్ల వంద శాతం ఫలితాలను సాధించాయి. మిగిలిన 22 పాఠశాలలు సరాసరి 95 శాతం ఫలితాలను సాధించి ఆధిక్యతను చాటుకున్నాయి. ఉన్న టీచర్లపైనే భారమంతా ... ఉర్దూ పాఠశాలల్లో డీఎస్సీ నియామకాలు జరిగినప్పుడల్లా టీచర్ పోస్టులు భర్తీ చేస్తూనే ఉన్నారు. కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 50 శాతానికి పైగా పోస్టులు ఎస్సీ,ఎస్టీ, బీసీ–ఏ,సీ,డీ కేటగిరీలకు కేటాయిస్తుండటంతో అభ్యర్థులు లేక అవి చాలాకాలంగా ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉర్దూ పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లే భారమంతా మోస్తూ నెట్టుకొస్తున్నారు. వి.కోట మండలంలోని కొంగాటం ఉర్దూ ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, రామకుప్పం మెయిన్ పాఠశాల ఒక ఉపా«ధ్యాయుడితోనే వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. అలాగే తిరుపతిలోని నెహ్రూ నగర్ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు కూడా లేకున్నా ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎస్జీటీలు, ఓ తెలుగు ఉపాధ్యాయునితో 95 శాతం ఫలితాలు సాధించారు. మెరుగైన వసతులు కల్పించి , పూర్తి స్థాయిలో టీచర్లను నియమిస్తే ఇతర పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉర్దూ పాఠశాలలు ఫలితాలు సాధిస్తాయనడంలో సందేహం లేదు. -
ఉర్దూ పాఠశాలలపై సర్కార్ నిర్లక్ష్యం
అనంతపురం అర్బన్: ఉర్దూ పాఠశాలల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఇంతియాజ్ మండిపడ్డారు. మంగళవారం నగరంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల బాలికల ఉర్దూ పాఠశాలను జిల్లా ప్రధాన కార్యదర్శి ముష్కిన్, కమిటీ సభ్యులు అల్లాబక్ష్, మహబూబ్ బాషాతో కలిసి సందర్శించారు. అక్కడి విద్యార్థినులతో ఇంతియాజ్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడిచినా పదో తరగతి విద్యార్థులకు సాంఘిక, సామాన్య శాస్త్రాలు, గణితం పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. ప్రతి ఏడాదీ సగం మంది విద్యార్థులకు ఉపకార వేతనం అందని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి మాత్రమే ఇలా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతారాహిత్యానికి ఇదో నిదర్శనమని మండిపడ్డారు. కంబదూరులో అన్ని తరగతులకూ ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడని, కణేకల్, తలుపుల, కదిరి, తదితర ప్రాంతాల్లోని ఉర్దూ పాఠశాలల్లో ఉర్దూ ఉపాధ్యాయులు లేరని అన్నారు. మైనారిటీ విద్యార్థుల సమస్యలపైన, వారి సంక్షేమం పైన రాష్ట్ర మైనార్టీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
సర్కార్ చదువులు డీలా
సాక్షి, సంగారెడ్డి: సర్కార్ బడుల్లో చదువులు మొక్కుబడిగా సాగుతున్నాయి. ఉపాధ్యాయులు లేకుండానే ఆరు నెలలుగా పాఠశాలలను నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీ ప్రకటన వెలువడుతుందని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రకటించినా ఇప్పటివరకు అతీగతి లేకుండా పోయింది. డీఎస్సీ, టెట్‌ను వేర్వేరుగా నిర్వహించాలా?, సంయుక్తంగా నిర్వహించాలా? అన్న అంశాన్ని ప్రభుత్వం తేల్చకపోవడంతో ఐదు నెలలుగా నోటిఫికేషన్‌కు నోచుకోవడం లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశాలూ కనిపించడం లేదు. ఓవైపు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు విద్యా వలంటీర్లు సైతం లేకపోవడంతో విద్యార్థులు అరకొర చదువులు సాగిస్తున్నారు. పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఆటపాటలతో కాలం గడుపుతున్నారు. 926 పోస్టుల కోసం ప్రతిపాదనలు.. జిల్లాలో మొత్తం 926 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ విద్యాశాఖ అధికారులు డీఎస్సీ కోసం ప్రతిపాదనలు పంపారు. నోటిఫికేషన్ జారీలో జాప్యం జరుగుతోండడంతో జిల్లాలో వంద మంది ప్రత్యేక విద్యా వలంటీర్లను నియమించుకోడానికి అనుమతించాలని కలెక్టర్ నెల రోజుల క్రితం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వలంటీర్ల నియామకం కూడా నిలిచిపోయింది. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్న బడులకు ఇతర పాఠశాలల నుంచి 117 మంది ఉపాధ్యాయులను పంపించి తాత్కాలికంగా సర్దుబాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు రెండో రోజుల క్రితం కలెక్టర్ అనుమతి కోరారు. టెన్త్ ఫలితాలపై ప్రభావం పదోతరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. మరో నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. డిసెంబర్ నెలాఖరులోగా సిలబస్ పూర్తి చేయాల్సి ఉన్నా ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గతేడాది పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. ఈ సారి ఉపాధ్యాయుల కొరత టెన్త్ ఫలితాలను మరింత దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. దయనీయంగా ఉర్దూ బడులు జిల్లాలో 729 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడూ సెలవు తీసుకుంటే ఆ పాఠశాలలు సైతం మూతబడుతున్నాయి. ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని పాఠశాలలు 76 ఉన్నాయి. అందులో ఉర్దూ మీడియం బడులే 46 ఉన్నాయి. ఉర్దూ మాధ్యమం బడులు మరీ దయనీయ స్థితికి చేరుకున్నాయి. ఈ మాధ్యమంలోని ప్రాథమిక పాఠశాలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. 2010-11లో 158 ఉన్న ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలల సంఖ్య 2011-12లో 154కు తగ్గిపోగా 2012-13లో 149కు పడిపోయింది.