సాక్షి, సంగారెడ్డి: సర్కార్ బడుల్లో చదువులు మొక్కుబడిగా సాగుతున్నాయి. ఉపాధ్యాయులు లేకుండానే ఆరు నెలలుగా పాఠశాలలను నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీ ప్రకటన వెలువడుతుందని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రకటించినా ఇప్పటివరకు అతీగతి లేకుండా పోయింది. డీఎస్సీ, టెట్‌ను వేర్వేరుగా నిర్వహించాలా?, సంయుక్తంగా నిర్వహించాలా? అన్న అంశాన్ని ప్రభుత్వం తేల్చకపోవడంతో ఐదు నెలలుగా నోటిఫికేషన్‌కు నోచుకోవడం లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశాలూ కనిపించడం లేదు. ఓవైపు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు విద్యా వలంటీర్లు సైతం లేకపోవడంతో విద్యార్థులు అరకొర చదువులు సాగిస్తున్నారు. పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఆటపాటలతో కాలం గడుపుతున్నారు.
926 పోస్టుల కోసం ప్రతిపాదనలు..
జిల్లాలో మొత్తం 926 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ విద్యాశాఖ అధికారులు డీఎస్సీ కోసం ప్రతిపాదనలు పంపారు. నోటిఫికేషన్ జారీలో జాప్యం జరుగుతోండడంతో జిల్లాలో వంద మంది ప్రత్యేక విద్యా వలంటీర్లను నియమించుకోడానికి అనుమతించాలని కలెక్టర్ నెల రోజుల క్రితం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వలంటీర్ల నియామకం కూడా నిలిచిపోయింది. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్న బడులకు ఇతర పాఠశాలల నుంచి 117 మంది ఉపాధ్యాయులను పంపించి తాత్కాలికంగా సర్దుబాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు రెండో రోజుల క్రితం కలెక్టర్ అనుమతి కోరారు.
టెన్త్ ఫలితాలపై ప్రభావం
పదోతరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. మరో నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. డిసెంబర్ నెలాఖరులోగా సిలబస్ పూర్తి చేయాల్సి ఉన్నా ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గతేడాది పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. ఈ సారి ఉపాధ్యాయుల కొరత టెన్త్ ఫలితాలను మరింత దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది.
దయనీయంగా ఉర్దూ బడులు
జిల్లాలో 729 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడూ సెలవు తీసుకుంటే ఆ పాఠశాలలు సైతం మూతబడుతున్నాయి. ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని పాఠశాలలు 76 ఉన్నాయి. అందులో ఉర్దూ మీడియం బడులే 46 ఉన్నాయి. ఉర్దూ మాధ్యమం బడులు మరీ దయనీయ స్థితికి చేరుకున్నాయి. ఈ మాధ్యమంలోని ప్రాథమిక పాఠశాలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. 2010-11లో 158 ఉన్న ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలల సంఖ్య 2011-12లో 154కు తగ్గిపోగా 2012-13లో 149కు పడిపోయింది.
సర్కార్ చదువులు డీలా
Published Sun, Dec 1 2013 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement