ఊరూవాడా ‘వైఎస్సార్ కుటుంబం’
ప్రజల నుంచి విశేషస్పందన
వైఎస్సార్ కుటుంబంలో సభ్యుడిగా చేరాలని కోరిన నాయకులు
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభించిన ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే మరోవైపు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేయనున్న నవరత్నాల్లాంటి పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాలు సుభిక్షంగా ఉండేవన్నారు. ఆ మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలతో దాదాపు ప్రతి ఇల్లూ లబ్ధి పొందిందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మళ్లీ సువర్ణయుగం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీసీని దీవించాలంటూ విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సభ్యుడిగా చేరాలని కోరారు. రాయదుర్గం మండలం రాయంపల్లి, కెంచానపల్లి, టి.వీరాపురం, కనేకల్లు, గోపులాపురం, బొమ్మనహాల్ మండలం హరేసముద్రం, డి.హీరేహాల్‌లో కార్యక్రమం జరిగింది. రాయంపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, బీసీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎంపీ సిద్ధప్ప, బీటీపీ గోవిందు తదితరులు పాల్గొన్నారు. కాపు రామచంద్రారెడ్డి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచారు. నవరత్నాలు గురించి తెలియజేశారు. కళ్యాణదుర్గం మండలం సీబావిలో మండల కన్వీనర్ వెంకటేశులు, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అలాగే బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండలో మండల కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే శింగనమల నియోజకవర్గం శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, పుట్లూరు మండలాల్లో ప్రారంభమైంది.
ఆయా మండలాల కన్వీనర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మడకశిర నియోజకవర్గంలో అమరాపురం, రొళ్ల, గుడిబండ మండలాల్లో జరిగింది. పెనుకొండ నియోజకర్గం గోరంట్ల మండలంలో కార్యక్రమం ప్రారంభమైంది. ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ, కూడేరు మండలాల్లో జరిగింది. గుంతకల్లు పట్టణం పాతగుంతకల్లులో నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి మహిళలను ఆప్యాయంగా పలుకరించారు. నవరత్నాల ప్రాముఖ్యతను వివరించారు. వైఎస్సార్ సీపీ కుటుంబంలో ప్రతి ఒక్కరు చేరేలా చూడాలన్నారు.