సేంద్రియ ఎరువులు వాడాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్
బోట్‌క్లబ్ (కాకినాడ) : రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాలని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా సోమవారం కృషిభవన్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమిలో సారం తగ్గడంతోపాటు రైతులు ఎక్కువ పెట్టుపెడి పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ విషయం భూసార పరీక్షల్లో వెల్లడైందన్నారు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూమి సారవంతగా తయారవుతుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకంలో మనరాష్ట్రం ప్రపంచంలోనే ముందంజలో ఉందన్నారు. జిల్లాలోని పలు పంట పొలాల్లో సూక్ష్మధాతు లోపాలు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు రైతులు జింక్, బోరాన్ వంటి వాటిని వేసుకోవాలన్నారు. వీటిని సబ్సిడీపై అందిస్తున్నట్టు చెప్పారు. పెద్దనోట్ల రద్దు కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు. రైతులు కూడా రూపేకార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపాలని కోరారు. ప్రస్తుతం రైతులు ధాన్యం అమ్మిన నగదు బ్యాంకుల్లో జమవుతుందని , రైతుల ఖాతాల్లో ఎంత నగదు పడినా దానికి పన్ను కట్టనవసరం లేదన్నారు. వ్యవసాయశాఖ జేడీ కేఎస్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. పురుగు మందులు కొనుగోలు చేస్తుంటే పలు దుకాణాల్లో బిల్లులు ఇవ్వడం లేదని, సేంద్రియ ఎరువుల వాడడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ డీడీలు వీటీ రామారావు, లక్ష్మణరావు, కాకినాడ ఏడీ భవానీ, వైవీ సుబ్బారావు రైతులు పాల్గొన్నారు.