
వంశీ, ఉమా ఇన్నర్ వార్
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పటమట పోలీసులు కేసు నమోదు చేయడం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నర్‌రింగ్ రోడ్డుకు కావాల్సిన భూమిని సేకరించటం కోసం పేదల గుడిసెల తొలగింపు నోటీసులు ఇచ్చేందుకు రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు ఆదివారం ఉదయం వెళ్లగా స్థానికులు నిరసన వ్యక్తంచేసి అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ అక్కడకు వచ్చి గ్రామస్తుల్ని శాంతపరిచి ఈ విషయం ముఖ్యమంత్రితో చ ర్చించిన తరువాత నిర్ణయం తీసుకుందామని అధికారులకు గట్టిగా చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఇరువర్గాల మధ్య వివాదాన్ని తగ్గించడానికి వచ్చిన ఎమ్మెల్యే వంశీపై అధికారుల విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారంటూ కేసు నమోదు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
మంత్రి ఉమాతో ఎమ్మెల్యే వంశీకి విభేదాలు...
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ఎమ్మెల్యే వంశీకి విభేదాలున్నాయి. మంత్రి ఉమా ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను వంశీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. పోలవరం కుడికాల్వ నుంచి దెందులూరు, మైలవరం నియోజకవర్గాల రైతులు మోటార్లు ఉపయోగించి నీరు తీసుకున్నారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలోని రైతుల పంటలను కాపాడేందుకు ఎమ్మెల్యే వంశీ పోలవరం కాల్వకు మోటార్లు ఏర్పాటు చేశారు. గన్నవరం రైతుల్లో వంశీకి బలం పెరుగుతోందని భావించిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇరిగేషన్ అధికారులను ఉపయోగించి ఆయా మోటార్లను తొలగించేందుకు ప్రయత్నించారు.
దీన్ని వంశీ అడ్డుకుని.. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానంటూ హెచ్చరించడంతో అధికారులు వెనక్కి తగ్గారు. పోలవరం కుడికాల్వలో మట్టిని కూడా గన్నవరం నియోజకవర్గ రైతులు తమ పొలాల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని జలవనరుల శాఖాధికారులు అడ్డుకోవడం వెనుక కూడా మంత్రి ఉమా హస్తం ఉందనే విమర్శలు ఉన్నాయి. రామవరప్పాడులో ప్రజల కోరిక మేరకు వంతెన నిర్మాణానికి ఎంపీ కొనకళ్ల నారాయణతో కలిసి రూ.5 కోట్లను ఎమ్మెల్యే వంశీ మంజూరు చేయించారు. ప్రస్తుతం రైవస్‌కాల్వపై వంతెన కడితే భవిష్యత్తులో మెట్రో రైలు నిర్మాణానికి ఇబ్బంది వస్తుందంటూ ఇరిగేషన్ అధికారులు దీనికి అనుమతులు ఇవ్వడం లేదు.
గత ఎన్నికల్లో తన ను గెలిపిస్తే వంతెన నిర్మిస్తానంటూ ఎమ్మెల్యే వంశీ రామవరప్పాడు రైతులకు హామీ ఇచ్చారు. అది నెరవేరకుండా అధికారులు అడ్డుపడుతున్నారని వంశీ వర్గం భావిస్తోంది. ఇప్పుడు రామవరప్పాడు ప్రజల్లో వంశీని పలచన చేయడానికే ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం పేదల ఇళ్లను బలవంతంగా తీసుకునేందుకు రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు ముందుకు వచ్చారని, దీని వెనుక మంత్రి ఉమా హస్తం ఉండవచ్చని వంశీ వర్గం భావిస్తోంది.
స్వపక్షంలోనే విపక్షం...
గత ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చిన రామవరప్పాడు ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు వంశీ అధికారులతో వివాదానికి దిగారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాతనే ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఇళ్లు తొలగిస్తానని గతంలో కలెక్టర్ హామీ ఇచ్చి ఇప్పుడు ఆకస్మికంగా ఇళ్లు తొలగించేందుకు నోటీసులు ఇవ్వడంపై వంశీ అధికారులను ప్రశ్నించారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సోదరుడు బాజీప్రసాద్‌కు చెందిన ఇనోటెల్ హోటల్‌ను కాపాడేందుకే పేదల ఇళ్లను తొలగిస్తున్నారంటూ బహిరంగంగా ఆరోపించారు.
తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు వంశీ స్వపక్షంలోనే విపక్షంగా మారడం, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పార్టీలో వాడివేడిగా చర్చ సాగుతోంది. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసుల్లో నిందితులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఎమ్మెల్యేను పిలిచి కనీసం ప్రశ్నించడానికి సాహసించని బెజవాడ పోలీసులు ఎమ్మెల్యే వంశీపై అంత దూకుడుగా కేసు నమోదు చేయడం వెనుక ఎవరి హస్తం ఉండవచ్చని ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.