- వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి
- ‘వంగవీటి’ సినిమాపై మండిపాటు
వర్మ పతనానికి నాంది
Published Mon, Dec 26 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) :
పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత వంగవీటి మోహనరంగాను ‘వంగవీటి’ సినిమాలో రౌడీగా చూపించడం సరికాదని, ఈ సినిమాయే దర్శకుడు రాంగోపాలవర్మ పతనానికి నాంది అని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో స్థానిక ట్రైనింగ్ కళాశాల వద్ద సోమవారం వంగవీటి రంగా 28వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు పోరాడిన రంగా ఆశయాలను ప్రతిఒక్కరూ నెరవేర్చాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రంగా పేద ప్రజల కోసం నిత్యం కోటీశ్వరులతో పోరాడుతూనే ఉండేవారని, రంగాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ రంగా జీవించి ఉంటే రాష్ట్ర రాజకీయాలు వేరుగా ఉండేవని చెప్పారు. రంగాను రౌడీగా చూపించడాన్ని యువత తిప్పికొట్టాలన్నారు. వైఎస్సార్ సీపీ రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ వంగవీటి సినిమాపై యువత చాలా అసంతృప్తిగా ఉందని, వెంటనే ఈ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూరల్ కో–ఆర్డినేటర్ గిరజాల వీర్రాజు(బాబు) మాట్లాడుతూ కాపులంతా సంఘటితంగా పోరాడకపోతే, ఉనికి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా పీసీసీ నేత రామినీడి మురళి, వివిధ సంఘాల కాపు నాయకులు నందెపు శ్రీనివాస్, అల్లు శేషునారాయణ, వడ్డి మల్లికార్జు¯ŒS ప్రసాద్, బెజవాడ రంగారావు, వడ్డి మురళి. సీసీసీ చానల్ ఎండీ పంతం కొండలరావు తదితరులు రంగా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ లంక సత్యనారాయణ, మింది నాగేంద్ర, మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్, మానే దొరబాబు, సుంకర శ్రీను తదితరులు పాల్గొన్నారు.
‘వంగవీటి’ సినిమా ప్రదర్శన నిలిపివేత
పి.గన్నవరం :
దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహనరంగాపై రామ్‌గోపాల్‌వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం రాత్రి స్థానిక బాలబాలాజీ థియేటర్‌లో సినిమా ప్రదర్శనను బోడపాటివారిపాలెం గ్రామ యువకులు నిలిపివేశారు. సినిమాను ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని, ఆందోళన చేపడతామని థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. రంగాకు మద్దతుగా, వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సుమారు అరగంట సేపు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో బోడపాటివారిపాలేనికి చెందిన రంగా మిత్రమండలి యూత్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement