వర్గపోరుతో నిధుల వాపస్
- రూ.3.20 కోట్ల సబ్‌ప్లాన్ నిధులు వెనక్కి
- ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల విభేదాలే కారణం
- దళితవాడల అభివృద్ధిపై చిత్తశుద్ధి కరువు
- ఆ నిధులు మళ్లీ తెచ్చుకోవడం కష్టమే
కదిరి : కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వర్గాలకు చెందిన కౌన్సిలర్ల మధ్య విభేదాల నేపథ్యంలో దళితవాడల అభివృద్ధి కోసం మంజూరైన రూ.3.20 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ నిధులు తమ వార్డులోనే ఖర్చు చేయాలని ఒక వర్గం.. కాదు తమ వార్డులోనే వెచ్చించాలంటూ మరో వర్గం వారు పోటీపడ్డారు. ఆఖరుకు ఎక్కడా ఖర్చు చేయకుండానే వచ్చిన నిధులన్నీ తిరుగుముఖం పట్టాయి.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్ చంద్రశేఖర్ (36వ వార్డు) గతంలో తన పదవికి రాజీనామా సమర్పించారు. కొందరు నచ్చజెప్పడంతో ఆఖరుకు తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తల్లి నారాయణమ్మ పేరుమీద అనధికారికంగా ఏర్పడిన కాలనీకే ఎక్కువ మొత్తంలో సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయాలని కౌన్సిల్ ఆమోదం కోసం అజెండా సిద్ధం చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో పాటు సొంత పార్టీ కౌన్సిలర్లు సైతం కొందరు వ్యతిరేకించడంతో కౌన్సిల్ ఆమోదం పొందలేదు.
ఎస్సీ, ఎస్టీలున్న చోటే ఖర్చు చేయాలి
వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఆ వర్గాల ప్రజలు ఎక్కువ శాతం నివాసమున్న ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలనే నిబంధనలున్నాయి. అయితే.. ఎస్సీ, ఎస్టీలు లేని వార్డుల్లోనూ ఆ నిధులు ఖర్చు చేయడానికి మునిసిపల్ పాలకులు ప్రయత్నించారు. తద్వారా ‘స్వామి భక్తి’ని చాటుకోవాలని వారు ప్రయత్నించగా కథ అడ్డం తిరిగింది. సబ్‌ప్లాన్ ని«ధుల కేటాయింపు విషయంలో పారదర్శకత లేకపోవడాన్ని ప్రతి కౌన్సిల్‌లోనూ మెజార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో ఆ అం«శం ప్రతిసారీ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గడువు ముగిసిపోవడంతో నిధులు వాపసు వెళ్లిపోయాయి.
అభివృద్ధికి నోచుకోని దళితవాడలెన్నో..
కదిరి మునిసిపాలిటీ పరిధిలో రాజీవ్‌గాంధీనగర్, కుటాగుళ్ల, అమీన్‌నగర్, నిజాంవలీ కాలనీ, పాత హరిజనవాడతో పాటు ఎస్సీ, ఎస్టీలు ఎక్కువమంది నివాసమున్న కాలనీలు, వీధులు చాలానే ఉన్నాయి. ఆయా ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదు. సబ్‌ప్లాన్ నిధులు వెచ్చించినట్లయితే రోడ్లు, వీధిదీపాలు, మురుగుకాలువలు పూర్తయ్యేవి. అయితే.. ఆ ఇద్దరు నేతల అనుచరుల కొట్లాట కారణంగా అభివృద్ధి కుంటుపడింది.
ఈ పరిస్థితి ఎన్నడూ లేదు–రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్, కదిరి
మంజూరైన నిధులు ఖర్చు చేయకుండా వాపసు వెళ్లిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ శాతం మంది ఉన్న చోట ఖర్చు చేయడానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. కానీ టీడీపీలోని గ్రూపుల కారణంగా అభివృద్ధి కుంటుపడుతోంది. వచ్చిన నిధులు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి.
నిధుల వాపసు వాస్తవమే– భవానీప్రసాద్, మునిసిపల్ కమిషనర్, కదిరి
సబ్‌ప్లాన్ నిధులు సుమారు రూ.3.20 కోట్లు వాపసు వెళ్లిపోయిన మాట వాస్తవమే. ఈ అంశంపై చాలా సార్లు కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టాం. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరక చివరకు నిధులు వాపసు వెళ్లాయి. మళ్లీ ఆ నిధులు తెచ్చుకోవడం కష్టమే!