వేడుకకు వెళుతూ మృత్యుఒడిలోకి..
Published Sun, Jan 22 2017 12:50 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
తేతలి (తణుకు) : తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేతలి గ్రామానికి చెందిన మానూరి ముత్యాలమ్మ (55) ఆటో ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా తాడేపల్లిగూడెం నుంచి అంబాజీపేట వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ముత్యాలమ్మ సంఘటనా స్థలం లోనే మృతి చెందింది. దువ్వ గ్రామంలోని తన మనుమరాలు పుష్పవతి కావడంతో వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆ ప్రాంతం రోదనలతో నిండిపోయింది. సర్పంచ్ కోట నాగేశ్వరరావు మృతురాలి బంధువులను పరామర్శించారు. రూరల్ ఎస్సై వి.జగదీశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement