పులకించిన సాగరతీరం
-
ముగిసిన వేళాంగణి మహోత్సవాలు
తోటపల్లిగూడూరు: కోడూరు వేళాంగణిమాత(మరియమాత) జన్మదిన ఆరాధనోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. యేసుక్రీస్తు తల్లి వేళాంగణిమాత జన్మదినోత్సవాలు ఈ నెల 6 నుంచి జరుగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఉత్సవాల్లో చివరి రోజు గురువారం రాత్రి అమ్మవారికి సమిష్ట దివ్యబలిపూజ, తేరు ప్రదక్షిణ కార్యక్రమాలు అత్యంత వేడుకగా జరిగాయి. భక్తులు అమ్మవారి పుణ్యక్షేత్ర ఆవరణలో రాత్రి జాగారాలు చేశారు. అనంతరం ఉత్సవాల్లో చివరి ఘట్టమైన సముద్ర స్నానాలకు భక్తులు ఆసక్తి చూపారు. ఆలయంలో రాత్రి జాగరణ చేసిన వేలాది మంది భక్తులు శుక్రవారం వేకువజాము నుంచి స్థానికంగా ఉన్న కోడూరు బీచ్‌లో పుణ్యస్నానాలకు బయల్దేరారు. భక్తుల పుణ్యస్నానాలతో కోడూరు సాగర తీరం పులకించిపోయింది. వేళాంగణి చర్చి ప్రాంతం భక్తులతో కిక్కిరిసింది.