రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే, అయినంతమాత్రాన అది సర్వరోగ నివారిణి కాదు, సంజీవని అంతకంటే కాదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఆదివారం ఆయన కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారతి ట్రస్టులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో ప్రత్యేక హోదా అంశంపై ఆచితూచి మాట్లాడారు. ఈ విషయంలో తనపై వచ్చే విమర్శలకు జవాబు చెప్పబోనని అంటూనే ప్రస్తుతం జరుగుతున్న చర్చకు వివరణ ఇచ్చారు.
ఆర్థిక సంఘం ప్రతిపాదనలతో సందిగ్ధత నెలకొని ప్రత్యేకహోదా సమస్య తలెత్తిందన్నారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కేవలం హోదా వల్లే అంతా జరిగిపోతుందని భావించకూడదన్నారు. ఇప్పటికే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందని, రాష్ట్రానికి పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలను మంజూరుచేసిందని చెప్పారు. విభజనతోపాటే హోదా కూడా చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ప్రత్యేక హోదా సమస్య తలెత్తి ఉందేది కాదని చెప్పారు.దేశమంతటా ఒకే విధంగా పన్నుల విధానాన్ని అమలు చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందుతుందని తాను భావిస్తున్నానన్నారు.
తిరంగా యాత్ర
భావితరాలకు దేశభ క్తిని ప్రబోధించేందుకు, స్వాతంత్య్రోద్యమ చారిత్రక ఘాట్టాలను గుర్తు చేస్తూ ఆగస్టు 15 నుంచి తిరంగాయాత్రను దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు వెంకయ్య చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 9వ తేదీన మధ్యప్రదేశ్‌లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన ప్రదేశం నుంచి ప్రారంభిస్తారని చెప్పారు. మీడియా సమావే శంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.