వెంకయ్య సమక్షంలో 'ఆ ఇద్దరు' వాగ్వివాదం
నెల్లూరు: ప్రొటోకాల్ విషయమై కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి... వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో సదరు ఇద్దరు నేతలు వాగ్వివాదానికి దిగి... ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని... వారిని సముదాయించారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఈ సంఘటన నెల్లూరు జిల్లా చిత్తమూరు మండలం గుణపాటిపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ను ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపైకి వెంకయ్యనాయుడు, సోమిరెడ్డితో పాటు ఉన్నతాధికారులు చేరుకున్నారు.
వెంకయ్యనాయుడు ప్రసగించేందుకు ఉపక్రమిస్తుండగా.... వేదికపైకి వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధుల పిలకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఇంతలో సోమిరెడ్డి జోక్యం చేసుకుని పాశం సునీల్ కుమార్తో వాగ్వివాదానికి దిగారు.