
'సినిమాల ప్రభావంతోనే ఆ హత్యలు'
నెల్లూరు: చిల్డ్రన్స్ పార్క్ వద్ద దోపిడి, హత్య ఘటనలో కీలక నిందితుడు సైకో వెంటేశ్వర్లును పోలీసులు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. గతంలో కావలి, పెద్దచెరుకూరులో పలు హత్యలు చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సెటాప్ బాక్సులు రిపేర్ చేయాలని ఇంట్లోకి ప్రవేశించి.. నగదు, నగలు దోచుకొని హత్యలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. సినిమాల ప్రభావంతో వెంకటేశ్వర్లు హత్యలకు పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు.
శనివారం నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఆడిటర్ నాగేశ్వరరావు ఇంట్లోకి దోపిడీ దొంగలు చొరబడి భారీ స్థాయిలో నగలు, నగదు దోచుకోవడమేకాక కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో నాగేశ్వరరావు భార్య ప్రభావతి మృతి చెందగా.. కుమారుడు, కుమార్తె గాయపడ్డారు. సైకో వెంకటేశ్వర్లు పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.