చంద్రబాబు పతనం ప్రారంభం
రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు
ధవళేశ్వరంలో అడ్డుకున్న పోలీసులు
నోటీసులు జారీ
ధవళేశ్వరం : కాపుల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పతనం ప్రారంభమయిందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్‌బ్యారేజ్ మీదుగా రాజమహేంద్రవరం వైపు వెళుతున్న హనుమంతరావును పోలీసులు ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్‌లో అడ్డుకున్నారు. జిల్లాలో 144సెక్షన్ అమలులో ఉందని, జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వెనుదిరిగి వెళ్లిపోయాలని పోలీసులు సూచించారు. తానేమి పాకిస్థాన్‌కు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వి.హనుమంతరావు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజమహేంద్రవరం దక్షిణ మండల డిఎస్పీ నారాయణరావు హనుమంతరావుతో చర్చించారు. తాను కిర్లంపూడి వెళ్లనని వ్యక్తిగత పనిమీద రాజమహేంద్రవరం వచ్చానని 26న తిరిగి వెళతానని హనుమంతరావు పేర్కొన్నారు. దీంతో ఆయనను ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ బయట తన వాహనంలోనే కూర్చున్న హనుమంతరావు తాను వెనక్కి వెళ్ళేది లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. విషయం తెలుసుకున్న ధవళేశ్వరం కాపు సంఘం నాయకులు పెద్దఎత్తున ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలి వచ్చి హనుమంతరావుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హమిని నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. 144సెక్షన్‌లు అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తగదని ఇప్పటికైన చంద్రబాబునాయుడు ముద్రగడ పద్మనాభంతో మాట్లాడి ఇచ్చిన హామిని నెరవేర్చాలన్నారు. అనంతరం ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వెనక్కి వెళ్ళేందుకు నిరాకరించడంతో వి.హనుమంతరావును రాజమహేంద్రవరంలోని హోటల్‌కు పోలీస్ బందోబస్తు నడుమ తరలించారు.
ప్రభుత్వ తీరు దారుణం : గిరజాల
కాపులను బీసీల్లో చేర్చాలని శాంతియుతంగా చేపట్టనున్న పాదయాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ గిరజాల వీర్రాజు(బాబు ) పేర్కొన్నారు. ధవళేశ్వరంలో పోలీసులు అడ్డుకున్న వి.హనుమంతరావును గిరజాల వీర్రాజు(బాబు) కలిశారు. పోలీసులతో ఉద్యమాన్ని అణగతొక్కాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందని గిరజాల వీర్రాజు(బాబు) విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు కాపులు తమ సత్తాను చూపుతారన్నారు.