'లక్షన్నరకు తొమ్మిది లక్షలు వసూలు చేశారు'
విజయవాడ: కాల్మనీ వ్యవహారంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. విజయవాడలోని సింగ్ నగర్కు చెందిన చిన్నారి, శ్రీనివాస్ దంపతులు కాల్మనీ వ్యవహారం ద్వారా తీవ్రంగా నష్టపోయామంటూ టాస్క్ఫోర్స్ను ఆశ్రయించారు. కాల్మనీ ద్వారా అవసరానికి ఒకటిన్నర లక్షలు అప్పుగా తీసుకుంటే వ్యాపారులు తమ వద్ద నుండి తొమ్మిది లక్షల రూపాయలను వసూలు చేసినట్లు తెలిపారు. అయినా ఇప్పటికీ కాల్మనీ వ్యాపారులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయారు.
కాగా,కాల్మనీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన బ్యాంకాక్ నుండి వేరే దేశానికి పరారయినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు చెన్నుపాటి శ్రీనుతో పాటు డీఈ సత్యానంద కూడా పరారీలో ఉన్నారు.