ఇప్పుడెందుకీ.. ప్రయోగాలు!
‘వంగవీటి’ సినిమా కోసం నగరంలో రాంగోపాల్‌వర్మ పర్యటన
అప్పటి పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రయత్నం
ఇప్పుడెందుకీ పనంటూ వర్మకు పలువురి సూచన
విజయవాడ : తాను తీస్తున్న కొత్త సినిమా ’వంగవీటి’కి తగిన సమాచారం సేకరించేందుకు సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ నగరంలో రెండురోజులపాటు పర్యటించారు. పలువురిని కలిసి.. పలు ప్రాంతాలు తిరిగారు. అయితే ఎప్పుడో జరిగిన ఘర్షణలపై ఇప్పుడెందుకీ ప్రయోగాలు అని పలువురు ఆయనకు సూచించారు.
ఇప్పుడంతా ప్రశాంతం...
నగరంలో ఎప్పుడో జరిగిన ఘర్షణల వ్యవహారం పూర్తిగా సద్దుమణిగింది. నగరం ప్రశాంత వాతావరణానికి వచ్చింది. 26 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న పరిణామాలపై అప్పట్లో వంగవీటి మోహనరంగాతో ఉన్నవారు పెద్దగా మాట్లాడేందుకు అంగీకరించలేదు. పైగా రాంగోపాల్ వర్మను వారించారు. నాటి పరిస్థితులకు, నేటి పరిస్థితులకు ఎంతో తేడా ఉందని, ఇప్పుడు అప్పటి పరిణామాలు చూపాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
అప్పట్లో జరిగిన పరిణామాలు ఇప్పటి జనాన్ని మేల్కొలిపేవేమీ కాదని, అలాంటప్పుడు గతాన్ని తవ్వుకోవడం దేనికనే వాదనను ఆయన ముందు వినిపించారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్, న్యాయవాది కర్నాటి రామ్మోహన్‌లు కూడా వర్మ యత్నాలు విరమించుకోవాలని సూచించారు. వర్మ బృందం నగరంలోని పలు ప్రాంతాలు తిరగటంతో పోలీసులు వారి వెన్నంటే ఉన్నారు. రాంగోపాల్ వర్మ మాత్రం తన వర్గాన్ని తనతోపాటు ఉండేలా చూసుకున్నారు. వీరంతా అభిమానులని చెప్పేందుకు వీలులేదు.
అప్పట్లో మరణాలు...
నగరంలో కమ్యూనిస్ట్ నేత చలసాని వెంకటరత్నం 1972లో హత్యకు గురయ్యారు. అప్పటిలో సంచలనం సృష్టించిన ఈ హత్య తరువాత 1974లో వంగవీటి మోహనరంగా సోదరుడైన రాధాృష్ణను ఆగంతకులు హతమార్చారు.
ఆ తర్వాత 1979లో దేవినేని నెహ్రూ సోదరుడు గాంధీ హత్యకు గురయ్యారు. 1983లో ఎన్టీఆర్ నూతనంగా తెలుగుదేశం పార్టీని స్థాపించటంతో కొంతకాలం ఘర్షణ వాతావరణాలు చోటుచేసుకున్నా హింసాత్మక ఘటనలు అంతగా నమోదు కాలేదు. మళ్లీ 1988 ప్రారంభంలో మురళీ హత్యకు గురయ్యారు.
అదే ఏడాది డిసెంబర్‌లో వంగవీటి రంగాను హత్య చేశారు. దీంతో పలువురు అభిమానులు విజయవాడలో విధ్వంసానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రంగా అభిమానులు అలాగే ఉన్నారు. నేటికీ ఆయన అభిమానులు రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి దేవుడిగా పూజిస్తున్నారు. రంగా పేదల మనసులో గొప్ప నాయకుడిగా నిలిచిపోయారు.
నగరంలో పర్యటన ఇలా...
శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్న వర్మ హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్క్‌లో బస చేశారు. శనివారం తన స్నేహితుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వద్దకు వెళ్లారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్‌ను ఇంటికి వెళ్లి కలిశారు.
ఆయనతో సుమారు గంటపాటు సమావేశ మయ్యారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారితో సమావేశానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించారు. ఎప్పుడో జరిగిన పరిణామాలు ఇప్పుడు ఎందుకని, ఇప్పుడు తెరపైకి తీసుకురావడం వల్ల ఈ తరానికి చెప్పేదేమీ ఉండదని ఆమె భావించినట్లు సమాచారం. అనంతరం ఆయన గుణదలలోని మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) నివాసానికి చేరుకుని సుమారు రెండు గంటలపాటు ఆయనతో చర్చించారు.
మధ్యాహ్నం నగర పశ్చిమ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వద్దకు వెళ్లి కొద్దిసేపు గడిపారు. అక్కడి నుంచి వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీకి వెళ్లారు. విద్యార్థులతో గెట్ టుగెదర్ నిర్వహించారు. ఆ తరువాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.