పల్లెటూరిలో ప్రసవవేదన
• అసంపూర్తి వంతెనతో అందని వైద్యం
• ఇద్దరు గర్భిణులకు ఇంటివద్దే కాన్పు
వేమనపల్లి: ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలంలోని లోతువొర్రె వంతెన పూర్తయినా వాహనాలు దాటలేని దుస్థితి. వంతెన ముందున్న గుంతను పూడ్చకపోవడంతో ప్రాణసంకటంగా తయారైంది. ప్రభుత్వం అంబులెన్స్ ఏర్పాటుచేసినా వంతెన దాట లేదు. ఫలితంగా ఇద్దరు నిరుపేద మహిళలకు ప్రసవవేదనే మిగిలింది. లింగాల గ్రామానికి చెందిన పెద్దల మల్లీశ్వరి శనివా రం వేకువజామునుంచి పురిటి నొప్పులతో బాధపడుతోంది.కుటుంబసభ్యులు పీహెచ్‌సీ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేశారు. అవ్వల్ కమిటీ అంబులెన్స్ లోతువొర్రె వద్దకు వచ్చింది. వరద నీరు ప్రవహిస్తుండటంతో ఒర్రె దాటలేని పరిస్థితి.
అంబులెన్స్ డ్రైవర్ గాలి నరేష్ అటువైపు ఉన్న నెన్నెల పీహెచ్‌సీ అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. ఆ లోపు కుటుంబసభ్యులు వేరే మార్గం లేక, అటవీ ప్రాంతంలో ఉంచలేక నిండు గర్భిణిని ఇంటికి తరలించారు. 25 కిలోమీటర్ల దూరం లో ఉన్న నెన్నెల నుంచి అంబులెన్స్ వచ్చే సరికి ఇంటి వద్దే కాన్పు అయ్యింది. శుక్రవారం నాగారం గ్రామానికి చెందిన ఒల లక్ష్మి అనే గ ర్భిణీకి ఇదే పరిస్థితి ఎదురైంది. పీహెచ్‌సీ నుంచి అంబులెన్స్ వచ్చినా దాటలేని దుస్థితి. 4 గంటలు ఒర్రె దగ్గరే ఉండి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటివద్దే సుఖప్రసవం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.