సేవలకు విమ్స్ రెడీ! | vims ready for hospitality | Sakshi
Sakshi News home page

సేవలకు విమ్స్ రెడీ!

Published Sun, Apr 3 2016 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

సేవలకు విమ్స్ రెడీ!

సేవలకు విమ్స్ రెడీ!

రూ.22 కోట్ల  వైద్య పరికరాలు రాక
30 మంది డాక్టర్ల నియామకం
ఔట్‌సోర్సింగ్‌లో 150 మంది సిబ్బంది

సాక్షి, విశాఖపట్నం : వాయిదాలపై వాయిదాలు పడుతూ వస్తున్న విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్) ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రాథమికంగా ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలతో శ్రీకారం చుట్టనుంది. తొలుత ఈ నెల 7న విమ్స్‌ను ప్రారంభిస్తామని ఇటీవల అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. అయితే ఆ రోజు అమావాస్య కావడం వల్ల ముహూర్తాన్ని 11వ తేదీకి మార్చారు. ఈ నేపథ్యంలో ఓపీ సేవలకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. ముహూర్తానికి మరో వారం రోజులే ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సమకూరుతున్న వసతులు
ఆస్పత్రికి ముఖ్యంగా రూ.22 కోట్ల విలువైన వైద్య పరికరాలను సమకూర్చారు. వీటిలో శస్త్రచికిత్స థియేటర్లు, పరికరాలు, టేబుళ్లు, ఎనస్థీషియా (మత్తు) యంత్రాలు, మంచాలు, పరుపులు వంటివి ఉన్నాయి. ప్రస్తుతానికి 50 పడకలతో ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నారు. గతంలో ఈ ఆస్పత్రికి ఇచ్చిన మంచాలు నాసిరకానికి కావడంతో వెనక్కి పంపేశారు. వాటి స్థానంలో నాణ్యమైన అత్యాధునిక మంచాలను తెచ్చారు. వీటిని ఆస్పత్రిలో అమర్చారు కూడా. త్వరలో మరో 350 మంచాలను తీసుకురానున్నారు.

సిబ్బంది నియామకాలు
వైద్య సేవలకు వీలుగా 30 మంది డాక్టర్లను నియమించారు. వీరు కాకినాడ, గుంటూరు, శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రుల నుంచి వస్తున్నారు. ఇటీవల కేజీహెచ్‌లో నియమితులైన 20 మంది నర్సులను కూడా విమ్స్‌కు పంపుతున్నారు. వీరితో పాటు 150 మంది వైద్య, వైద్యేతర సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో నియామకాలు జరుపుతున్నారు. మరోవైపు కోరమాండల్ ఫెర్టిలైజర్స్ సంస్థ గార్డెనింగ్ బాధ్యతలను చేపట్టింది. పారిశుద్ధ్యం, ఎలక్ట్రికల్ పనులు కూడా సత్వరమే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా రూ.18 లక్షల విలువైన సర్జికల్, మందులను కూడా సిద్ధం చేశామని, ప్రారంభోత్సవం నాటికి ప్రాథమికంగా అన్ని హంగులు, సదుపాయాలను సమకూరుస్తామని విమ్స్ డెరైక్టర్ డాక్టర్ సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement