రాష్ట్రపతి పురస్కారానికి విశ్వనాథ గోపాలకృష్ణ ఎంపిక
రాజమహేంద్రవరం కల్చరల్ :
సంస్కృత భాష వికాసానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికయ్యారు. విశాఖపట్నంలో ఉన్న ఆయన ఈ సందర్భంగా సోమవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్ర : మీ తండ్రి విశ్వనాథ జగన్నాథ ఘనపాఠి భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దశాబ్దాల తరువాత మీరు కూడా రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. దీనిపై మీ స్పందన ఏమిటి?
విశ్వనాథ : ఈ సత్కారాన్ని మా తండ్రి ఆశీస్సులు, గురుదేవుల దీవెనలుగా భావిస్తున్నాను.
ప్ర : యువత చూపు పూర్తిగా సాంకేతిక విద్యపై ఉన్న ప్రస్తుత తరుణంలో సంస్కృత భాషపై ఆసక్తి కలిగించడానికి ప్రభుత్వపరంగా చేపట్టవలసిన చర్యలు వివరిస్తారా?
విశ్వనాథ : పదో తరగతి వరకూ సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలి. ఆర్షధర్మం, సనాతన సంప్రదాయాలు తెలియాలంటే సంస్కృత భాషా పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉండి తీరాలి. సంస్కృతం నేర్వకుండా నైతిక విలువల పునరుద్ధరణ జరిగే పని కాదు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు మూలబిందువు సంస్కృత భాషే. దీనిని పిన్నలు నేర్చుకునేలా పెద్దలు కూడా ప్రోత్సహించాలి.