రాజమండ్రి రూరల్, సిటీ నియోజకవర్గాల్లోని ఇసుక నిల్వలు ఊడ్చేసిన జనసేన నేత
రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి సన్నిహితుడిగా గుర్తింపు
దీంతో గోరంట్ల, ఆదిరెడ్డి మధ్య చెలరేగిన చిచ్చు
సుమారు రూ.5 కోట్ల విలువచేసే ఇసుక అక్రమ విక్రయం
సిటీ పరిధిలోకి ఎందుకొచ్చావని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆగ్రహం
మైన్స్ అధికారులకూ మందలింపు
మీరైనా ఆపాలి కదా అని అధికారులపై చిందులు
సాక్షి, రాజమహేంద్రవరం : నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజమహేంద్రవరంలో ఇప్పుడు ఇసుక తుపాను చెలరేగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చీరావడంతో ఆ పార్టీల నేతలు ఇసుక మీద పడ్డారు. వర్షాకాలం పురస్కరించుకుని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందస్తుగా నిల్వ ఉంచిన ఇసుకను ఊడ్చేశారు.
ఇప్పుడిదే వారి మధ్య వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఓ జనసేన నేత అత్యుత్సాహం రాజమహేంద్రవరంలోని ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. నగర రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిన ఈ ఇసుక బాగోతం కథాకమామిషు ఏంటంటే..
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య ఈ ఇసుక దుమారం రేగింది. గోరంట్లకు అనుచరుడిగా పేరుగాంచిన ఓ జనసేన నేత ఇసుక వ్యాపారమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు ఇసుక దందాకు తెరలేపారు. ఇందులో భాగంగా.. గోదావరి వరదల సమయంలో ప్రజలకు ఇబ్బందిలేకుండా ర్యాంపుల్లో నిల్వ ఉంచిన ఇసుకను ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు ఆ గుట్టలు మింగేశారు.
రాత్రి, పగలు అన్న తేడాలేకుండా అక్రమంగా తరలించి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. రాజమండ్రి రూరల్ పరిధిలోని గ్రాయత్రి–1, 2, 3, 4, 5 పేర్లతో ఉన్న ఇసుక ర్యాంపుల్లోని నిల్వలను ఆ నియోజకకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా బుచ్చయ్య అనుచరుడైన ఓ జనసేన నేత ఇసుక మొత్తం ఊడ్చేశాడు. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో అధికారులు అటువైపు వెళ్లేందుకు కూడా సాహసించలేదు.
దీంతో మరింత రెచ్చిపోయిన ఆ నేత రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలోని కోటిలింగాల ర్యాంపులపై కూడా కన్నేశాడు. పరిస్థితులు అనుకూలంగా ఉండటం.. నూతన ఇసుక పాలసీ త్వరలో రానుండటంతో ముందుగానే తరలించేయాలన్న ఆలోచనతో దానిని ఎడాపెడా తరలించేసి అమ్మేశారు. ఇలా రూరల్, సిటీ నియోజకవర్గాల పరిధిలో నిల్వ ఉన్న సుమారు రూ.5 కోట్లు విలువ చేసే ఇసుక కొల్లగొట్టినట్లు సమాచారం. దోపిడీ చేసిన సొమ్ములో తన గురువుకు కొంత లాభం చేకూర్చినట్లు తెలిసింది.
సిటీ ఎమ్మెల్యే తండ్రి సీరియస్..
ఇదిలా ఉంటే.. ఈ విషయం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దృష్టికి వెళ్లడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తమ ఇలాకాలో తమకు తెలీకుండా ఇసుక తరలించుకుపోవడంపై అవాక్కయ్యారు. అదీ తన విరోధి బుచ్చయ్యచౌదరి అనుచరుడని తేలడంతో మండిపడ్డారు.
తన నియోజకవర్గ పరిధిలో ఉన్న నిల్వలకు సంబంధించిన నగదు తనకివ్వాలని సదరు నేతకు కబురు పంపినట్లు సమాచారం. ఆ నేత నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంపై అప్పారావు కారాలు మిరియాలు నూరుతున్నారు. అలాగని ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే కూటమిలో భాగమైన జనసేన నేత కావడం, పార్టీ పెద్దలకు మరో రకమైన సంకేతాలు వెళ్తాయని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
అధికారులపై చిందులు?
మరోవైపు.. ఇసుక తరలించేస్తుంటే ‘మీరేం చేస్తున్నారు? అడ్డుకోవాలి కదా..’ అంటూ ఆదిరెడ్డి అప్పారావు మైనింగ్ అధికారులపై చిందులేసినట్లు తెలిసింది. రాజమండ్రి సిటీ పరిధిలో ఒక్క ఇసుక రేణువు తీసుకెళ్లాలన్నా తన అనుమతి ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం.
అధికార పార్టీకి చెందిన నేత కావడంతో ఏమీ చెప్పలేక అధికారులు మిన్నకుండిపోయారు. ఇసుక తరలించిన వ్యక్తి కూటమి నేత కావడం, ఆయన్ను ఏమీ అనలేక తమపై రుబాబు చూపడంపట్ల అధికారుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment