విజయనగరం సరి‘కిల్’
విజయనగరం సాగునీటి సర్కిల్ కార్యాలయం ఏర్పాటులో జిల్లా పాలకులు విఫలమయ్యారు. అక్కడి పాలకుల ఒత్తిడి మేరకు శ్రీకాకుళానికి తాజాగా సర్కిల్ కార్యాలయం మంజూరు చేయగా... ఇక్కడి అధికారపార్టీ నాయకులు చేతకానితనం వల్ల జిల్లాలో జలవనరులశాఖ ఒక కొలిక్కి రాకుండా పోయింది. ఫలితంగా జిల్లాలో ఉన్న బొబ్బిలి సర్కిల్ కార్యాలయం పరిధి కేవలం రెండు డివిజన్లకే పరిమితం కాగా... విజయనగరం డివిజన్ విశాఖపట్నంలో కొనసాగాల్సి వస్తోంది.
విజయనగరం గంటస్తంభం: ఉత్తరాంధ్రలో మైనర్, మీడియం ఇరిగేషన్‌కు ఇంతవరకు రెండు సర్కిల్ కార్యాలయాలు ఉన్నారుు. ఇందులో ఒకటి బొబ్బిలిలో ఉండగా మరొకటి విశాఖపట్నంలో ఉంది. బొబ్బిలిలో ఉన్న సర్కిల్ కార్యాలయం పరిధిలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఐదు ఇరిగేషన్ డివిజన్లు, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, జంఝావతి డివిజన్లు ఉన్నాయి. జిల్లాలో ఉన్న విజయనగరం డివిజనుతో పాటు శ్రీకాకుళం జిల్లాలో అన్ని డివిజన్లు విశాఖపట్నంలో కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తూ జలవనరుల శాఖ తాజాగా జీవో నంబరు 106 జారీ చేసింది. దాని ప్రకారం బొబ్బిలి సర్కిల్ పరిధిలో ఇంతవరకు ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని ఐదు డివిజన్లు ఆ సర్కిల్ కార్యాలయం పరిధిలోకి వెళ్లారుు. పార్వతీపురం మైనర్ ఇరిగేషన్ డివిజన్, జంఝావతి డివిజన్ మాత్రమే బొబ్బిలి సర్కిల్‌లో మిగిలాయి.
మన సంగతేమిటి?
శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు వెనుక అక్కడి నేతల తీవ్ర కృషి ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన అక్కడ మంత్రి, ఇతర నాయకులు సర్కిల్ కార్యాలయం సాధిం చుకున్నారు. బొబ్బిలి కార్యాలయంతో సంబంధం లేకుండా చేసుకున్నారు. కానీ అలాంటి ప్రతిపాదనే మన జిల్లా నుంచి కూడా జలవనరులశాఖ కార్యాలయానికి వెళ్లింది. జిల్లా కేంద్రం విజయనగరంలో ఒక సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని జెడ్పీ వేదికగా తిర్మానించి ప్రతిపాదన పంపించారు. కానీ శ్రీకాకుళానికి సర్కిల్ కార్యాలయం మంజూరు చేస్తూ జారీ చేసిన ప్రభుత్వం మన ప్రతిపాదనను పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి జిల్లాపై చిన్నచూపు చూసిందని స్పష్టమవుతుంది. మంత్రు లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం వల్లే రాలేదని చర్చజరుగుతోంది.
సర్కిల్ కార్యాలయం ఒక్కటైతే...
వాస్తవానికి సర్కిల్ కార్యాలయం ఏర్పా టు కావాల్సిన అవసరం ఉందని ఆ శాఖ అధికారులే అభిప్రాయపడుతున్నారు. శ్రీకాకుళంలో ఉన్న ఐదు డివిజన్లతో కొత్త గా అక్కడ సర్కిల్ కార్యాలయం ఏర్పాటుతో బొబ్బిలి రెండింటికి పరిమితం కావడంతో అక్కడ పనిభారం తగ్గినట్లేనంటున్నారు. ఈ నేపధ్యంలో విజయనగరం డివిజన్‌తో కలిపి మూడింటిని ఒక సర్కిల్ పరిధిలోకి తీసుకొచ్చి జిల్లా పరిధిలో కొత్త సర్కిల్ ఏర్పాటు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. దీనివల్ల విజయనగరం వాసులు విశాఖపట్నం సర్కిల్‌కు వెళ్లే శ్రమ తగ్గుతుందని చెబుతున్నారు. బొబ్బిలిలో ఉన్న సర్కిల్ కార్యాలయం విజయనగరంలో ఏర్పాటు చేస్తే రైతులతోపాటు ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందుబాటులో ఉంటుందంటున్నారు. ఆ దిశగా పాలకులు చొరవ చూపితే బాగుంటుందని ఒక సీనియర్ ఇంజినీరు అభిప్రాయపడ్డారు.