అభివృద్ధి చూసి ఓటేశారు
అభివృద్ధి చూసి ఓటేశారు
Published Sun, Mar 12 2017 12:51 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
పాలకొల్లు సెంట్రల్ : ప్రజాశ్రేయస్సును పక్కన పెట్టి బీజేపీని ఓడించాలనే ధ్యేయంగా అన్ని పార్టీలు కలిసి పనిచేసినా అభివృద్ధిని మాత్రం ఓడించలేకపోయారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శనివారం రాష్ట్ర స్వచ్ఛభారత్ కన్వీనర్ డాక్టర్ బాబ్జీ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ తమది గాలివాటం గెలుపు కాదు వంద శాతం అభివృద్ధి విజయమని ఉత్తర్‌ప్రదేశ్ ఫలితాలు నిరూపించాయి. పార్టీ విజయం సాధిస్తుందని తెలుసు కానీ 320కి పైగా స్థానాలు గెలుచుకోవడం చూస్తుంటే ప్రధాని మోదీ పథకాలు ప్రజలపై ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుందన్నారు. త్వరలో ఏపీలోనూ బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కృషి చేస్తున్నారని చెప్పారు. అందుకోసం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నామని, ఇక్కడ కూడా విజయబావుటా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ నోట్ల రద్దుతో బీజేపీకి ప్రజాధరణ లేదని విపక్షాలు ఎన్నో ఆరోపణలు చేశారని, ప్రజాతీర్పు చూసిన తరువాత ఓటింగ్ యంత్రాల వైఫల్యమని అంటున్నారని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, క్వాయర్ బోర్డు డైరెక్టర్ పీవీఎస్ వర్మ, రావూరి సుధ, ఉన్నమట్ల కబర్ది పాల్గొన్నారు.
Advertisement