ఆవిష్కరణల దిశగా నడవండి
Published Thu, Aug 11 2016 5:03 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆవిష్కరల దిశగా నడవాల్సిన అవసరం ఉందని సింగపూర్‌కు చెందిన నాన్‌యాంగ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం(ఎన్‌టీయూ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య బి.వి.ఆర్ చౌదరి అన్నారు. గురువారం ఉదయం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు, ఇతర అధికారులతో పాలక మండలి సమావేశ మందిరంలలో ఆచార్య చౌదరి సమావేశమయ్యారు. ఎన్‌టీయూలో ప్రత్యేకంగా ఎన్‌టీయూ–ఇండియా కనెక్ట్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే తమ వర్సిటీ భారత్‌లోని ఐఐఎస్‌ఈ, ఐఐటీ, ఎన్‌ఐటీలతో పనిచేస్తోందన్నారు. ఇతే దరహాలో ఆంధ్రవిశ్వవిద్యాలయంతో పనిచేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఏయూ విద్యార్థులకు అవసరమైన ఇంటర్న్‌షిప్‌లు అందించనున్నట్లు తెలిపారు. సంయుక్త పరిశోధనలపై సాధ్యాసాధ్యాలు, అనువైన విభాగాలను పరిశీలించాలని సూచించారు. మెడికల్, ఇంజనీరింగ్ నిపుణులు సంయుక్తంగా పనిచేయడం వల్ల మెరుగైన పరిష్కారాలను చూపే దిశగా నడవాలన్నారు. ఐఐఎస్‌ఇతో నానో టెక్నాలజీ, ఐఐటీ ఢిల్లీతో ఎనర్జీ విభాగంలో పనిచేస్తున్నామన్నారు. సంయుక్తంగా పీహెచ్‌డీ ప్రోగ్రాములు నిర్వహించాలన్నారు. ఏయూ పూర్వవిద్యార్థిగా తనవంతు సహకారం అందిస్తానచెప్పారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏయూకు చెందిన నిపుణులు, అధికారులు ఎన్‌టీయూను త్వరలో సందర్శిస్తారన్నారు. వర్సిటీలోని యువ ఆచార్యులను గుర్తించి సంయుక్తంగా భవిష్యత్ పరిశోధనలు జరిపే అవకాశం ఉందన్నారు. సంయుక్తంగా సింపోజియంల నిర్వహణ, ఇంటర్న్‌షిప్‌లు కల్పించడం, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలను నిర్వహించాలని సూచించారు. పరిపాలకులకు సైతం నిరంతర అవగాహన, నిపుణత కల్పించాలని సూచించారు.
యూజీసీ సమన్వయకర్త ఆచార్య కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం 79ఎంఓయూలను కలిగి ఉందన్నారు. సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, ప్రిన్సిపాల్స్ ఆచార్య సి.వి రామన్, కె.గాయత్రీ దేవి,డి.సూర్యప్రకాషరావు,సి.హెచ్ రత్నం,డి.గౌరీ శంకర్,డీన్స్ ఆచార్య బి.మోహన వెంకట రామ్, కె.వైశాఖ్, బి.వి సందీప్, కె.రఘుబాబు, పేరి శ్రీనివాసరావు, గీతం వర్సిటీ ఆచార్యుడు శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆచార్య చౌదరీని సత్కరించి వర్సిటీ జ్ఞాపికను బహూకరించారు.
Advertisement