జల వివాదం
తొండూరు : పైడిపాళెం రిజర్వాయర్ నుంచి తొండూరు మండలం సంతకొవ్వూరు కెనాల్ ద్వారా వచ్చే నీటిని సింహాద్రిపురం మండలం లోమడ గ్రామస్తులు అడ్డుకోవడంతో జలవివాదం తలెత్తింది. గత నెల 28న పైడిపాలెం రిజర్వాయర్ నుంచి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా తొండూరు మండలానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. అయితే 29వ తేదీ ఆదివారం ఉదయం కృష్ణాజలాలు తొండూరు మండలానికి చేరాయి. దీంతో ఆదివారం రాత్రి లోమడ గ్రామానికి చెందిన రైతులు తొండూరు మండలానికి కృష్ణా జలాలు రాకుండా సుంకేసుల – రావులకొలను మధ్యలో అక్రమంగా జేసీబీతో వాగు వద్ద మట్టిని తొలగించి నీటిని లోమడ చెరువుకు మళ్లించారు. దీంతో సంతకొవ్వూరు కెనాల్‌లో కనీసం 20క్యూసెక్కుల నీరు కూడా రాకపోవడంతో తొండూరు మండల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, రైతులు సంతకొవ్వూరు కెనాల్ కాలువ గట్టు వెంబడి వెళ్లగా రావులకొలను – సుంకేసుల మధ్యలో నీటిని అక్రమంగా తరలిస్తున్నారని తెలుసుకున్నారు.
తొండూరు, లోమడ గ్రామాల రైతుల వాగ్వాదం
పైడిపాలెం రిజర్వాయర్ నుంచి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా తొండూరుకు వస్తున్న నీటిని లోమడ రైతులు అక్రమంగా తరలిస్తుండటంతో తొండూరు, లోమడ రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం తొండూరు మండల వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అంకిరెడ్డి సురేష్‌రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ వెంకట్రామిరెడ్డిలతోపాటు పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు నీటిని అక్రమంగా తరలిస్తున్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో తొండూరు, లోమడ రైతుల మధ్య నీటి కోసం మాటా మాటా పెరిగి చివరకు ఘర్షణ పడే స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, కొండాపురం సీఐ రవిబాబులతోపాటు సింహాద్రిపురం, తొండూరు ఎస్‌ఐలు హనుమంతు, శ్రీనివాసులు, దాదాపు 50మంది పోలీసులను సంఘటన స్థలానికి పంపారు. ఇరు గ్రామాల రైతులకు సర్ది చెప్పి ఘర్షణను నివారించారు.
అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం
పైడిపాలెం నుంచి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా తొండూరు మండలానికి రావాల్సిన నీటి వాటాను రాకుండా లోమడ రైతులు అక్రమంగా కాలువను ధ్వంసం చేసి నీటిని తరలిస్తున్నారని మైనర్ ఇరిగేషన్ అధికారులకు తొండూరు మండల నాయకులు, రైతులు ఫిర్యాదు చేశారు. అయినా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మైనర్ ఇరిగేషన్ డీఈలతో తొండూరు మండల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, లోమడ గ్రామస్తులతో కొండాపురం సీఐ రవిబాబు చర్చలు జరిపి అక్కడ జరుగుతున్న సంఘటనలను ఉన్నతాధికారులకు వివరించారు. తాత్కాలికంగా లోమడ చెరువుకు 40 శాతం నీటిని విడుదల చేసి.. మిగతా నీటిని తొండూరు మండలానికి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా వదిలేలా చర్చలు జరిపి రెండు మండలాల రైతులను అక్కడ నుంచి పంపించేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఈశ్వరరెడ్డి, తొండూరు మండల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, బూచుపల్లె బాలనరసింహారెడ్డి, ద్వారకనాథరెడ్డి, రజినికాంత్‌రెడ్డి, జింకా కుమార్, అమరనాథరెడ్డి, రంగనాథరెడ్డి, రాఘవరెడ్డి, రామాంజనేయులు, రామమునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.