paidipalem
-
జల వివాదం
తొండూరు : పైడిపాళెం రిజర్వాయర్ నుంచి తొండూరు మండలం సంతకొవ్వూరు కెనాల్ ద్వారా వచ్చే నీటిని సింహాద్రిపురం మండలం లోమడ గ్రామస్తులు అడ్డుకోవడంతో జలవివాదం తలెత్తింది. గత నెల 28న పైడిపాలెం రిజర్వాయర్ నుంచి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా తొండూరు మండలానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. అయితే 29వ తేదీ ఆదివారం ఉదయం కృష్ణాజలాలు తొండూరు మండలానికి చేరాయి. దీంతో ఆదివారం రాత్రి లోమడ గ్రామానికి చెందిన రైతులు తొండూరు మండలానికి కృష్ణా జలాలు రాకుండా సుంకేసుల – రావులకొలను మధ్యలో అక్రమంగా జేసీబీతో వాగు వద్ద మట్టిని తొలగించి నీటిని లోమడ చెరువుకు మళ్లించారు. దీంతో సంతకొవ్వూరు కెనాల్లో కనీసం 20క్యూసెక్కుల నీరు కూడా రాకపోవడంతో తొండూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు సంతకొవ్వూరు కెనాల్ కాలువ గట్టు వెంబడి వెళ్లగా రావులకొలను – సుంకేసుల మధ్యలో నీటిని అక్రమంగా తరలిస్తున్నారని తెలుసుకున్నారు. తొండూరు, లోమడ గ్రామాల రైతుల వాగ్వాదం పైడిపాలెం రిజర్వాయర్ నుంచి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా తొండూరుకు వస్తున్న నీటిని లోమడ రైతులు అక్రమంగా తరలిస్తుండటంతో తొండూరు, లోమడ రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం తొండూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అంకిరెడ్డి సురేష్‌రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ వెంకట్రామిరెడ్డిలతోపాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు నీటిని అక్రమంగా తరలిస్తున్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో తొండూరు, లోమడ రైతుల మధ్య నీటి కోసం మాటా మాటా పెరిగి చివరకు ఘర్షణ పడే స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, కొండాపురం సీఐ రవిబాబులతోపాటు సింహాద్రిపురం, తొండూరు ఎస్ఐలు హనుమంతు, శ్రీనివాసులు, దాదాపు 50మంది పోలీసులను సంఘటన స్థలానికి పంపారు. ఇరు గ్రామాల రైతులకు సర్ది చెప్పి ఘర్షణను నివారించారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం పైడిపాలెం నుంచి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా తొండూరు మండలానికి రావాల్సిన నీటి వాటాను రాకుండా లోమడ రైతులు అక్రమంగా కాలువను ధ్వంసం చేసి నీటిని తరలిస్తున్నారని మైనర్ ఇరిగేషన్ అధికారులకు తొండూరు మండల నాయకులు, రైతులు ఫిర్యాదు చేశారు. అయినా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మైనర్ ఇరిగేషన్ డీఈలతో తొండూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, లోమడ గ్రామస్తులతో కొండాపురం సీఐ రవిబాబు చర్చలు జరిపి అక్కడ జరుగుతున్న సంఘటనలను ఉన్నతాధికారులకు వివరించారు. తాత్కాలికంగా లోమడ చెరువుకు 40 శాతం నీటిని విడుదల చేసి.. మిగతా నీటిని తొండూరు మండలానికి సంతకొవ్వూరు కెనాల్ ద్వారా వదిలేలా చర్చలు జరిపి రెండు మండలాల రైతులను అక్కడ నుంచి పంపించేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఈశ్వరరెడ్డి, తొండూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, బూచుపల్లె బాలనరసింహారెడ్డి, ద్వారకనాథరెడ్డి, రజినికాంత్‌రెడ్డి, జింకా కుమార్, అమరనాథరెడ్డి, రంగనాథరెడ్డి, రాఘవరెడ్డి, రామాంజనేయులు, రామమునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సతీష్‌రెడ్డి క్షవరం కోసమే ‘పైడిపాలెం’ ప్రారంభం
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె రూరల్ : శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి క్షవరం కోసమే సీఎం చంద్రబాబు పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారని వైఎస్ఆర్సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన తన సృగృహంలో విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూ.660 కోట్లతో పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. కేవలం 10 శాతం పనులు టీడీపీ హయాంలో కొనసాగుతున్నాయన్నారు. ప్రారంభోత్సవంలో నిజాలు తెలుస్తాయనే ఉద్దేశంతో స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సభకు రాకుండా హౌస్ అరెస్టు చేశారని, తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో వదిలేశారన్నారు. జీఎన్ఎస్ పనులు పూర్తికాకున్నా అప్పుడే పులివెందులకు నీరిచ్చినట్లు చెప్పుకోవడం దారుణమన్నారు. గండికోట రిజర్వాయర్‌కు గోరుకల్లు ప్రాజెక్టు నుంచి జీఎన్ఎస్ ద్వారా నీరు విడుదల చేయాల్సి ఉందని, అయితే అక్కడి నుంచి అవుకు వరకు పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. దీంతో ఎస్ఆర్బీసీ ద్వారా అవుకు రిజర్వాయర్‌కు గోరుకల్లు నుంచి నీటిని విడదల చేస్తున్నారన్నారు. ఎస్ఆర్బీసీ కాల్వలో సామర్థ్యానికి మించి నీటి ప్రవాహం ఉందని, దీని వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివరామి రెడ్డి మాట్లాడుతూ గండికోటకు నీరు తీసుకెళ్లడం వల్ల ఇక్కడి రైతులకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నీటిని ఎస్ఆర్బీసీ కాల్వ ద్వారా కాకుండా జీఎన్ఎస్ ద్వారా తీసుకెళ్లాలన్నారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు లభించే నీటివాటాపై ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంక్రాంతి సంబరాలకు కేటాయించే ని«ధులను ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాలని కోరారు. రైతు సంఘం నాయకులు జయప్రకాష్‌రెడ్డి ఉన్నారు. -
బూట్లు నాకే వాణ్నయితే మంత్రిగానే ఉండేవాణ్ని
ఎంపీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు వేదికపై విస్తుపోయిన రాష్ట్ర మంత్రులు సాక్షి ప్రతినిధి, కడప: బూట్లు నాకే వాడినే అయితే ఎప్పుడూ మంత్రిగానే ఉండేవాడినని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపైనున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇదే ఊపులో జేసీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్రెడ్డికి వాళ్ల నాయన బుద్ధులు వచ్చుంటే ఎంతో కొంత మేలు ఉండేదన్నారు. వయసులో చిన్నవాడనే ఉద్దేశంతో ఆప్యాయంగా జగన్‌ను ‘వాడు’ అన్నానే తప్ప పొగరుతో కాదన్నారు. దానికే నాలుక చీలుస్తానంటావా? అంటూ శ్రీకాంత్‌రెడ్డిపై మండిపడ్డారు. మీ ఊరొచ్చా... ఎవరొస్తారో రండి... టచ్ చేసి చూడండంటూ చిందులు వేశారు. పనిలో పనిగా సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. ఒకప్పుడు రక్తం ప్రవహించిన పులివెందుల ప్రాంతం.. నేడు కృష్ణాజలాలతో పులకించనుందని, ఇది చంద్రబాబువల్లనే సాధ్యమైందని ప్రశంసించారు. గూండాలా, రౌడీలా మాట్లాడిన జేసీని సీఎం చంద్రబాబు ప్రోత్సహించడాన్ని చూసి అధికారవర్గాలు విస్తుపోయాయి.