
గాలేరు–నగరి కాలువకు నీరు విడుదల
అంతా మేమే చేశామని టీడీపీ నేతల ఆర్భాటం
వైఎస్ పుణ్యంతోనే నీరు వస్తున్నాయంటున్న ప్రజలు
జమ్మలమడుగు: గాలేరు–నగరి వదర కాలువ పూర్తిగా తామే నిర్మాణం చేశామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగానేప్రాజెక్టులు పూర్తయి కృష్ణాజలాలు వస్తున్నాయని టీడీపీ నాయకులు ఆర్భాటం చేశారు. మంత్రిగంటా శ్రీనివాసరావు అవుకు ప్రాజెక్టు సమీపంలో నిర్మించిన గాలేరి–నగరి కాలువపై నిర్మించిన గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. రెండు వేల క్యూసెక్కులైనా విడుదల చేస్తారని అందరూ భావించారు. అయితే మూడుగేట్లు ద్వారా కేవలం ఐదు వందల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయించారు. పైకి మాత్రం వెయ్యి క్యూసెక్కులు విడుదల చేశామని నాయకులు ప్రకటించారు.
20 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించే కాలువలో 500 క్యూసెక్కులే..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కడప జిల్లా, చిత్తూరు, నెల్లూరు ప్రాంత వాసులకు తాగునీరు సాగునీరు అందించడంలో భాగంగా ఏర్పాటు చేసిన గాలేరు–నగరి వరద కాలువ జిల్లాలో పూర్తయింది. మొత్తం 20వేలక్యూసెక్కుల నీరు ప్రవహించే కాలువలో కేవలం 500 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోంది. నీటి విడుదల కార్యక్రమాన్నిS చూడటానికి వచ్చిన ప్రజలు మాట్లాడుతూ ఈ నీరు వస్తుందంటే వైఎస్ పుణ్యమే తప్ప చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని అన్నారు.
సీమ అభివృద్ధికి సీఎం కృషి – మంత్రి గంటా
రాయలసీమ ప్రాంత అభివృద్ధికోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మైలవరం ఆయకట్టుకింద ఉన్న 75వేల ఎకరాలకు సాగునీరు. రెండు మున్సిపాలిటిలకు తాగునీరు అందించడంకోసం ప్రయత్నం జరుగుతుందని మంత్రి గంటాశ్రీనివాసరావు అన్నారు. గాలేరి–నగరి కాలువకు నీటిని విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కడప జిల్లా అంటే భయపడే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నీరు భవిష్యత్తులో హార్టికల్చర్ హాబ్‌కు తోడ్పడుతాయని తెలిపారు. శాసనమండలి డిఫ్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. మైలవరం, గండికోట ప్రాజెక్టులకు వరదనీరు దాదాపు నాలుగు నెలల పాటు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు,ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి,టీబీహెచ్‌ఎల్‌సీ చైర్మన్ ఉప్పలపాడు శ్రీనివాసరెడ్డి,సురేష్‌నాయుడు, రిమ్స్‌చైర్మన్ మురళీధర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్ధ చైర్మన్ రమణారెడ్డి, గిరిధర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.