
నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించాలి
విజయవాడ (లబ్బీపేట) : నగదు రహిత చెల్లింపుల అమలులో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ముందంజలో నిలిపి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అందుకు కళాశాలల ప్రిన్సిపాళ్లు తమవంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు. నగదు రహిత చెల్లింపులపై కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం స్థానిక సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో ఆయన అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నగదు రహిత చెల్లింపులపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామాన్ని ఒక కళాశాల దత్తత తీసుకుని, ఆ గ్రామ ప్రజలకు నగదు రహిత చెల్లింపులపై అవగాహన కలిగించి పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆన్‌లైన్ విధానం, బయోమెట్రిక్ అటెండెన్స్ పారదర్శకంగా నిర్వహించడం వల్ల అర్హులైన విద్యార్థులకు నేరుగా వారి ఖాతాలకు నగదు జమ అవుతుందన్నారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండాలని గంటా ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎస్.రామకృష్ణారావు, రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.