.. నేనే రాజీనామా చేసేవాడ్ని: గంటా
అమరావతి: పదో తరగతి పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ వాట్సప్‌లో బయటకు వచ్చిందని, పరీక్ష ప్రారంభానికి ముందు పేపర్ లీకైనట్టయితే తానే రాజీనామా చేసేవాడినని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్‌పై మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు. వాట్సప్‌లో పేపర్ రాగానే ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశామని, వాటర్ బాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గంటా చెప్పారు.
6.80 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారని మంత్రి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతినకుండా పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. వాట్సప్‌లో ఓ మెసేజి రావడం, దానిపై అధికారులు ఎలా స్పందించారో, ఏం చర్యలు తీసుకున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరంగా చెప్పారని తెలిపారు. పరీక్ష విధానం చాలా పెద్దదని, పరీక్ష పత్రాల సెట్టింగ్, ముద్రణ, కేంద్రాలకు చేర్చడం.. చాలా అంశాలున్నాయని చెప్పారు. పేపర్ సెట్టింగ్, ప్రింటింగ్, రవాణా చేస్తున్న సమయంలో కానీ పరీక్ష రాయడానికి ముందు గానీ పేపర్ లీకైతే సీరియస్ విషయమని అన్నారు.
అలాంటిది ఏమైనా జరిగి ఉంటే ఎవరూ డిమాండ్ చేయకుండానే తాను రాజీనామా చేసి ఉండేవాడిని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ వాట్సప్‌లో బయటకు వచ్చిందని, సంఘటన చిన్నదైనా వివరంగా విచారణ చేయాలని, బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకోవాలని సీఎం తమకు చెప్పారని తెలిపారు. పోలీసుల కంటే ముందుగానే విద్యాశాఖ అధికారులు స్పందించి, ఎక్కడి నుంచి పేపర్ వచ్చిందో తెలుసుకుని చర్యలు తీసుకున్నారని చెప్పారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి కేసులు ఉన్నాయని, ఈసారి చాలా తక్కువగా ఉన్నాయని గంటా తెలిపారు.