ఓర్వకల్లులో ఇండస్ట్రీయల్ పార్కుకు కేటాయించిన స‍్థలం
పరిశ్రమలకే దారేశారు!
Published Sat, Dec 3 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
- చెన్నై–బెంగుళూరు కారిడార్‌లో ఓర్వకల్‌కు చోటు
- నోడ్ పాయింట్‌గా ఇండస్ట్రీయల్ హబ్‌కు గుర్తింపు
- పరిశ్రమల రాకకు మరింత ఊతం
- పెరగనున్న రోడ్డు రవాణా సదుపాయాలు
- రైతుల భూముల విలువ పెరిగే అవకాశం
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): చెన్నై–బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్ మెగా ఇండస్ట్రీయల్ హబ్‌ను నోడ్ పాయింట్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇది కరువు సీమలో పరిశ్రమల స్థాపనకు మరింతగా ఊతం ఇవ్వనున్నదని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేకిన్ ఇండియాలో భాగంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బెంగళూరు–చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్‌కు శ్రీకారం చుట్టారు. కారిడార్ వెంబడి పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అనేక రాయితీలను కల్పిస్తున్నారు. పరిశ్రమలకు ముడి సరుకు తేవడానికి, ఉత్పత్తి అయిన మాల్‌ను తరలించడానికి చెన్నై–బెంగళూరును కలుపుతూ నాలుగు, ఆరు లేన్ల జాతీయ రహదారులను నిర్మిస్తారు. పరిశ్రమలకు అనుగుణంగా కొత్త రైల్వే మార్గాల నిర్మాణాలను చేపడుతారు. అంతేకాక కారిడార్ వెంబడి విద్యుత్, నీటి వసతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేపడుతున్న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రీయల్ హబ్‌ను చైన్నై–బెంగళూరు కారిడార్‌లో నోడ్ పాయింట్‌గా గుర్తించారు. నోడ్ పాయింట్ అంటే.. ఆ కారిడార్‌లో భాగంగా పరిగణిస్తారు.
పరిశ్రమల స్థాపనకు మరింత ఊతం:
ఓర్వకల్‌ను మెగా ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓర్వకల్ సమీపంలో 7214 ఎకరాలను సేకరించింది. మౌలిక సదుపాయాల కోసం ఏపీఐఐసీకి అప్పగించింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీయల్ హబ్‌కు చెన్నై–బెంగళూరు కారిడార్‌లో చోటు లభించడంపై మంచి పరిణామమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. పరిశ్రమలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో సాధారణంగా రైతుల భూములకు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది.
Advertisement