ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి
గుంటూరు (నెహ్రూనగర్): తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిళ్ళ మేరకే గుంటూరు కార్పొరేషన్‌లో ఓట్లు తొలగించారని, ఓట్ల తొలగింపులో పారదర్శకత లోపించిందని, ఏ ప్రతిపాదికన ఓట్లు తొలగించారో స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు నగర కమిషనర్ నాగలక్ష్మిని కోరారు. శుక్రవారం ఓట్ల తొలగింపుపై కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానూకూలంగా స్పందించిన కమిషనర్ ఓట్ల తొలగింపు విషయంలో పొరపాట్లు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఓట్లు తొలగించారంటూ ధ్వజమెత్తారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అన్నారు. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టిన తరుణంలో జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అక్షింతలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అధికార నేతలకు తలొగ్గి, వారి మెప్పుకోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు.